గడ్కరీ వేగం అందరికీ తెలుసు... ఆయన నాయకత్వంలో ఈ రికార్డు గర్వకారణం: సీఎం చంద్రబాబు

  • బెంగళూరు-విజయవాడ కారిడార్‌కు 4 గిన్నిస్ రికార్డులు
  • 5 రోజుల్లో 52 కి.మీ. 6 లేన్ల రహదారి నిర్మించి అరుదైన ఘనత
  • కేంద్ర మంత్రి గడ్కరీ, నిర్మాణ సంస్థకు సీఎం చంద్రబాబు అభినందనలు
  • అమరావతి-బెంగళూరు రోడ్డుగా పేరు పెట్టాలని ముఖ్యమంత్రి సూచన
బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో నాలుగు గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించిన ప్రతి ఒక్కరినీ ఆయన అభినందించారు. మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో కలిసి ఈ విజయోత్సవ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనిచేసే వేగం, సామర్థ్యం దేశంలో అందరికీ తెలుసు. ఆయన నాయకత్వంలో ప్రపంచస్థాయి రికార్డు సాధించడం గర్వకారణం," అని కొనియాడారు. వేగంగా, అత్యంత పొడవైన 6 లేన్ల బిటుమిన్ రహదారిని నిర్మించి గిన్నీస్ రికార్డు సాధించిన రాజ్ పథ్ ఇన్ ఫ్రా కామ్ సంస్థను ప్రత్యేకంగా అభినందించారు.

జనవరి 6 నుంచి 11వ తేదీ వరకు కేవలం ఐదు రోజుల్లో ఏకబిగిన 52 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారిని నిర్మించారని, అదేవిధంగా నిరంతరాయంగా 10,655 మెట్రిక్ టన్నుల బిటుమిన్ కాంక్రీట్‌ను వేసి మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారని వివరించారు. దీంతో పాటు 84.4 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి నిర్మాణ రికార్డును కూడా తిరగరాసినట్లు పేర్కొన్నారు. 

అమరావతి నుంచి బెంగళూరుకు నేరుగా నిర్మించ తలపెట్టిన రహదారికి 'అమరావతి-బెంగళూరు రోడ్డు'గా పేరు పెట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. బృందంగా పనిచేసి ఈ విజయాన్ని అందుకున్న అందరికీ మరోసారి అభినందనలు తెలియజేశారు.


More Telugu News