యూరప్ అంటే అంతా అందం కాదు.. మురికి, అభద్రత కూడా: భారతీయ వ్లాగర్ ‘రియాలిటీ చెక్’ వైరల్

  • సోషల్ మీడియాలో కనిపించే యూరప్ చిత్రాలన్నీ నిజం కావన్న ప్రతీక్ సింగ్
  • గందరగోళం, రద్దీ, అపరిశుభ్రతతో నిండిన నగరాలపై అసహనం
  • షెంజెన్ వీసా కోసం పడే కష్టానికి.. అక్కడ దక్కే అనుభవానికి పొంతన లేదన్న వ్లాగర్
  • నెట్టింట భిన్నాభిప్రాయాలు.. జపాన్, వియత్నాంలే బెటర్ అంటున్న నెటిజన్లు
యూరప్ పర్యటన అంటే అందమైన వీధులు, చారిత్రక కట్టడాలు మాత్రమే కాదని, అక్కడ మరో చీకటి కోణం కూడా ఉందని భారతీయ ట్రావెల్ వ్లాగర్ ప్రతీక్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. “యూరప్ రియాలిటీ” పేరుతో ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో మనం చూసే మెరిసే చిత్రాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపింది. ఈ వీడియోకు ఇప్పటికే 15 లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం.

యూరప్ చరిత్ర, వాస్తుశిల్పం అద్భుతమైనవే అని అంగీకరిస్తూనే ప్రస్తుత పరిస్థితులు చాలా ‘సంక్లిష్టంగా’ ఉన్నాయని ప్రతీక్ పేర్కొన్నారు. “పోస్ట్‌కార్డ్ లాంటి అందమైన వీధుల వెనుక.. మురికి, గందరగోళం, కొన్ని చోట్ల అభద్రతా భావం స్పష్టంగా కనిపిస్తున్నాయి. షెంజెన్ వీసా కోసం ఎన్నో పత్రాలు సమర్పించి, లక్షల రూపాయలు ఖర్చు చేసి అక్కడికి వెళ్తే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందా? అనిపిస్తోంది” అని ఆయన రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో కేవలం మంచి కోణాలను మాత్రమే చూపిస్తారని, కానీ అక్కడి రద్దీ, అపరిశుభ్రతను ఎవరూ చెప్పడం లేదని విమర్శించారు.

ఈ పోస్ట్‌పై నెటిజన్లు రెండుగా చీలిపోయారు. చాలా మంది ప్రతీక్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ యూరప్ కంటే జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం వంటి ఆసియా దేశాలే పర్యాటకులకు సురక్షితంగా, శుభ్రంగా, తక్కువ ఖర్చుతో కూడినవని కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా నేపుల్స్, మిలన్ వంటి నగరాల్లో చేదు అనుభవాలు ఎదురయ్యాయని మరికొందరు పంచుకున్నారు. అయితే, కొందరు మాత్రం ఇది కేవలం పర్యాటక సీజన్ రద్దీ వల్ల కలిగిన అనుభవమేనని, మొత్తం యూరప్‌ను ఇలా చూడటం సరికాదని వాదించారు. వివాదం పెరుగుతుండటంతో ప్రతీక్ మరోసారి స్పందిస్తూ.. తాను కేవలం చూసిన వాస్తవాలనే చెప్పానని, ఇది భారత్.. యూరప్ మధ్య పోలిక కాదని స్పష్టం చేశారు. 


More Telugu News