తీరం దాటిన వాయుగుండం..నేడు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు

  • శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టివు సమీపంలో వాయుగుండం తీరం దాటిందన్న ఐఎండీ 
  • పశ్చిమ దిశగా కదులుతూ ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని వెల్లడి
  • దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చన్న అమరావతి వాతావరణ కేంద్రం
బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. నిన్న ఇది వాయుగుండంగా మారి సాయంత్రం శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టివు సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది.

ముల్లయిట్టివుకు 30 కిలోమీటర్లు, జాఫ్నాకు 70 కిలోమీటర్లు, మన్నార్‌కు 90 కిలోమీటర్లు, కరైకల్‌కు 190 కిలోమీటర్లు, చెన్నైకు 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం పశ్చిమ దిశగా కదులుతూ ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.

దీని ప్రభావంతో తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. 


More Telugu News