ఆందోళనకారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ ప్రభుత్వం

  • ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం... తీవ్ర స్థాయిలో నిరసనలు
  • ఆందోళనకారులకు మరణశిక్ష తప్పదని ప్రభుత్వ హెచ్చరిక
  • కొనసాగుతున్న అణచివేత.. ఇప్పటికే 72 మందికి పైగా మృతి
  • శాంతియుత నిరసనకారులపై హింస వద్దంటూ ఇరాన్‌కు అమెరికా వార్నింగ్
  • దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, టెలిఫోన్ సేవల నిలిపివేత
ఆర్థిక సంక్షోభంతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో నిరసనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. గత రెండు వారాలుగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిరసనల్లో పాల్గొన్న వారికి మరణశిక్ష తప్పదని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

ఆందోళనకారులను దేశ శత్రువులుగా పరిగణిస్తామని, వారిపై దేశద్రోహం, అభద్రత సృష్టించడం వంటి అభియోగాల కింద మరణశిక్ష విధిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ మొహ్మద్ మోవాహెది ఆజాద్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి దయ చూపబోమని ఆయన తేల్చిచెప్పారు. ఈ అణచివేత చర్యలకు సుప్రీం లీడర్ కూడా మద్దతు పలికారు. 

నిత్యావసరాల ధరల పెరుగుదల, కరెన్సీ విలువ పతనం కావడంతో ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. భద్రతా బలగాల చర్యల కారణంగా ఇప్పటివరకు కనీసం 72 మంది మరణించారని, 2,300 మందికి పైగా అరెస్టయ్యారని మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. అయితే మృతుల సంఖ్య 200 దాటవచ్చని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను నిలిపివేయడంతో వాస్తవ పరిస్థితులు బయటకు తెలియడం లేదు.

మరోవైపు, ఇరాన్ ప్రభుత్వ వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. శాంతియుత నిరసనకారులపై హింసకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. "అధ్యక్షుడితో (ట్రంప్ తో) ఆటలాడొద్దు" అంటూ అమెరికా విదేశాంగ శాఖ కూడా ఇరాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ప్రజాగ్రహం పెరుగుతుండగా, ప్రభుత్వం అణచివేతను తీవ్రతరం చేయడంతో ఇరాన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


More Telugu News