హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ క్లియర్ చేసిన సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్... వీడియో ఇదిగో!

  • నందిగామ వైజంక్షన్ వద్ద రోడ్డు సరిగా లేకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్
  • ట్రాఫిక్ అవతారం ఎత్తి ట్రాఫిక్ క్లియర్ చేసిన నిర్మాత
  • పండుగ నేపథ్యంలో వీలైనంత త్వరగా రోడ్డు మరమ్మతులు చేసి ఉంటే బాగుండేదన్న సురేశ్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికమైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రజలు భారీగా తరలివెళుతున్నారు. సెలవులు ప్రారంభం కావడంతో జాతీయ రహదారిపై ఒక్కసారిగా ట్రాఫిక్ పెరిగిపోయింది. దీంతో ప్రయాణ సమయం ఆరు నుంచి ఏడు గంటల వరకు పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అధికంగా ఉంది. నందిగామ వైజంక్షన్ వద్ద రహదారి సరిగా లేకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ తన ప్రయాణ మార్గంలో ట్రాఫిక్ రద్దీని గమనించి ట్రాఫిక్ పోలీస్ అవతారం ఎత్తారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద నిలిచిపోయిన వాహనాలను ఆయన స్వయంగా క్లియర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ నేపథ్యంలో రహదారుల శాఖ వీలైనంత త్వరగా రోడ్డు మరమ్మతులు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

సంక్రాంతి పండుగ సమయంలో ఐదు నుంచి వారం రోజుల పాటు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఉంటుందని అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు. వాహనాల రద్దీకి రోడ్లు బాగా లేకపోవడం కూడా ఒక కారణమని, రోడ్లను త్వరగా బాగు చేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్ నుంచి అక్కడికి రావడానికి ఆరున్నర గంటలు పట్టిందని, ట్రాఫిక్ జామ్ వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈరోజు తాను కోలవెన్ను గ్రామానికి వెళుతున్నానని, అక్కడి నుంచి కారంచేడు, తణుకు వెళతానని ఆయన తెలిపారు. సంక్రాంతి సందర్భంగా స్నేహితులను, బంధువులను కలుస్తానని ఆయన చెప్పారు. టోల్ గేట్ల వద్ద వాహనాలు సులభంగా వెళ్లేందుకు అధికారులు చర్యలు చేపట్టడం అభినందనీయమని ఆయన కొనియాడారు.


More Telugu News