కరవబోయిన కుక్క.. శ్రేయస్ అయ్యర్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం!

  • ఎయిర్‌పోర్ట్‌లో అభిమాని కుక్క దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న వైనం
  • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • గాయం నుంచి కోలుకుని న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన అయ్యర్
టీమిండియా స్టార్‌ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డాడు. గాయం కారణంగా దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరమైన అయ్య‌ర్‌, తిరిగి జట్టులోకి అడుగుపెట్టే కొద్ది రోజుల ముందే ఓ ఊహించని ఘటనను ఎదుర్కొన్నాడు. ఎయిర్‌పోర్ట్‌లో అభిమాని పెంచుకుంటున్న కుక్క దాడికి ప్రయత్నించగా, అయ్యర్ అప్రమత్తతతో తప్పించుకున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్‌పోర్ట్‌లో శ్రేయస్ అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తుండగా, ఒక అభిమాని తెచ్చుకున్న కుక్కను ప్రేమగా నిమిరేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ కుక్క అనూహ్యంగా పైకి దూకి కరిచేందుకు ప్రయత్నించింది. వెంటనే స్పందించిన అయ్యర్ చేతిని వెనక్కి లాక్కున్నాడు. ఆ అభిమాని కూడా కుక్కను అదుపు చేసింది. ఈ అనూహ్య పరిణామంతో కాస్త షాక్ అయినా, అయ్యర్ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

గత అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో డైవింగ్ క్యాచ్ పడుతూ శ్రేయస్ తీవ్రంగా గాయప‌డ్డాడు. దీంతో అతడు జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు గాయం నుంచి పూర్తిగా కోలుకుని, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందాడు. రేప‌టి నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌ కోసం జట్టుతో చేరాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడి ఫామ్‌ను నిరూపించుకున్నాడు.


More Telugu News