బెంగళూరులో జగన్ బ్యాక్ ఆఫీస్.. కుట్రల కోసమేనన్న యనమల

  • బెంగళూరును కుట్రల కేంద్రంగా మార్చారంటూ జగన్‌పై యనమల ఆరోపణలు
  • అవినీతి కార్యకలాపాలకు బెంగళూరు ప్యాలెసే అడ్డా అని విమర్శ
  • ఏడీఆర్ నివేదిక ప్రకారం వైసీపీ నేతల ఆస్తులు 600 శాతం పెరిగాయని వెల్లడి
  • ఐదేళ్ల అవినీతితోనే వైసీపీ నేతలు సూపర్ రిచ్ క్లబ్‌లో చేరారని ఎద్దేవా
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరులో మకాం వేయడంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏపీలో కుట్రలు అమలు చేసేందుకే జగన్ బెంగళూరులో ఒక బ్యాక్ ఆఫీస్ ఏర్పాటు చేశారని, తన అవినీతి కార్యకలాపాలకు ఆ ప్యాలెస్‌ను కేంద్రంగా చేసుకున్నారని ఆరోపణలు చేశారు.

జగన్ ప్రస్తుతం ఉంటున్న బెంగళూరు ఆయన జన్మస్థలం కాదని, సొంత నియోజకవర్గం అంతకంటే కాదని యనమల అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం లేదా హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసం కానప్పుడు, యలహంక ప్యాలెస్‌లో ఎందుకు మకాం పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్ బెంగళూరు కేంద్రంగానే అనేక కుట్రలు, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని యనమల ఆరోపించారు.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడటం వల్లే జగన్ తో పాటు, వైసీపీ నేతల ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని ఆయన విమర్శించారు. ఏడీఆర్ తాజా నివేదిక ప్రకారం వారి ఆస్తులు 600 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్ల పాలనలో కూడబెట్టిన అవినీతి సంపద వల్లే వైసీపీ నేతలు 'నియో రిచ్ క్లబ్' నుంచి 'వరల్డ్ సూపర్ రిచ్ క్లబ్' స్థాయికి ఎదుగుతున్నారని యనమల ఎద్దేవా చేశారు.

జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్ వంటి సంస్థలు జగన్ అవినీతికి పుట్టినవేనని ఆయన అభివర్ణించారు. ఈ అవినీతి సంపదతో బడుగు బలహీన వర్గాలను అణగదొక్కుతూ, ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తున్నారని యనమల ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News