ఆలయాల్లో చోరీలు చేసే పాత నేరస్థుడి అరెస్ట్

  • ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న పటాన్‌చెరు గొల్ల బస్తీకి చెందిన పాత నేరస్తుడు దండు రవి
  • ఆభరణాలను విక్రయించడానికి బంగారు దుకాణాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • నిందితుడిపై రామచంద్రాపురం, చేవెళ్ల, హత్నూర, పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ల పరిధిలో 30కుపైగా కేసులు ఉన్నాయన్న పోలీసులు
ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని పటాన్‌చెరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ముత్తంగి డివిజన్, పోచారం ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పక్కన ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ నెల 6వ తేదీన చోరీ జరిగింది. స్వామివారి కిరీటాలు, హారాలు గుర్తుతెలియని వ్యక్తి అపహరించడంతో పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 
దర్యాప్తులో భాగంగా శుక్రవారం పటాన్‌చెరు మార్కెట్‌లోని బంగారం దుకాణాల వద్ద ఆభరణాలను అమ్మేందుకు స్కూటీపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడిని పటాన్‌చెరు గొల్ల బస్తీకి చెందిన పాత నేరస్తుడు దండు రవిగా పోలీసులు గుర్తించారు. దేవాలయంలో చోరీ చేసిన విషయం నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
 
రామచంద్రాపురం బాంబే కాలనీలో స్కూటీని దొంగతనం చేసి దానిపై వెళ్లి .. జల్సాల కోసం డబ్బుల అవసరంతో ఈ చోరీకి పాల్పడినట్లు నిందితుడు వెల్లడించాడు. అతని వద్ద నుంచి సుమారు 5 కిలోల వెండి ఆభరణాలు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
నిందితుడిపై గతంలో రామచంద్రాపురం, చేవెళ్ల, హత్నూర, పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ల పరిధిలో 30కు పైగా చోరీ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.


More Telugu News