Bhimavaram: సంక్రాంతి జోష్.. భీమవరంలో మూడు రోజులకు గది అద్దె రూ. లక్ష!

Bhimavaram Sankranti room rent surges to Rs 1 lakh
  • ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హౌస్‌ఫుల్ అయిన హోటళ్లు, లాడ్జీలు 
  • సాధారణ ధరల కంటే 3 నుంచి 4 రెట్లు అదనపు వసూళ్లు   
  • తాడేపల్లిగూడెంలో రూ. 2.5 కోట్లతో భారీ పందెం సిద్ధం
  • హైటెక్ సొగసులతో ముస్తాబైన బరులు
  • ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తున్న పందెంగాళ్లు
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అప్పుడే అంబరాన్ని తాకాయి. ముఖ్యంగా కోడి పందేలకు కేంద్రబిందువైన భీమవరంలో ఈసారి పండుగ జోష్ గతానికి మించి కనిపిస్తోంది. పందేలను తిలకించేందుకు ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివస్తుండటంతో వసతి గదులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు వంటి పట్టణాల్లోని దాదాపు 150 హోటళ్లలో ఒక్క గది కూడా ఖాళీ లేదు. డిమాండ్‌ను సాకుగా చూపుతూ యజమానులు అద్దెలను భారీగా పెంచేశారు. సాధారణంగా రోజుకు రూ. వెయ్యి నుంచి రూ. 5 వేలు ఉండే గది ధర, ఇప్పుడు మూడు రోజుల ప్యాకేజీ కింద రూ. 30 వేల నుంచి రూ. 60 వేల వరకు పలుకుతోంది. భీమవరంలోని కొన్ని ప్రముఖ హోటళ్లలో మూడు రోజులకు గాను ఒక్కో గదికి రూ. లక్ష చొప్పున వసూలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు సైతం గెస్ట్ హౌస్‌లను ముందే రిజర్వ్ చేయడంతో సామాన్య పర్యాటకులకు వసతి భారంగా మారింది.

ఈసారి బరుల వద్ద పందేల జోరు మరింత పెరగనుంది. ఇప్పటికే నిర్వాహకులు పందెంగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తాడేపల్లిగూడెంలో రూ. 2.5 కోట్లతో ఒక భారీ పందెం సిద్ధమవ్వగా, సీసలి, నారాయణపురం, చినఅమిరం వంటి ప్రాంతాల్లో రూ. కోటి పందేలకు సిండికేట్లు కాలుదువ్వుతున్నాయి. గత ఏడాది పెద్ద మొత్తంలో గెలిచిన పందెంగాళ్లను తమ బరులకు రప్పించేందుకు నిర్వాహకులు పోటీ పడుతున్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం ఇప్పటికే ప్రైవేటు ఇళ్లు, కల్యాణ మండపాలు కూడా అద్దెకు తీసుకుంటున్నారు.
Bhimavaram
Sankranti
cockfights
Andhra Pradesh
hotel rooms
room rent
Godavari districts
Tadepalligudem
Eluru
Tamil Nadu

More Telugu News