BCCI: బంగ్లాదేశ్ అంశంపై స్పందించిన బీసీసీఐ

BCCI Responds on Bangladesh Issue Regarding World Cup
  • తమ వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బీసీబీ
  • బీసీబీ విజ్ఞప్తిపై ఐసీసీ అధికారికంగా ప్రకటన విడుదల చేయని వైనం 
  • ముంబయిలో సమావేశమైన బీసీసీఐ ఉన్న ఉన్నతాధికారులు
  • బంగ్లాదేశ్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల తరలింపు తమ పరిధిలోని అంశం కాదన్న బీసీసీఐ కార్యదర్శి సైకియా
టీ20 వరల్డ్ కప్ - 2026లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు భారత్‌కు వచ్చే అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. భద్రతా కారణాలను చూపుతూ తమ వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఐసీసీని కోరిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సానుకూలంగా స్పందించలేదన్న వార్తలు వెలువడుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ నేపథ్యంలో ఈ అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తొలిసారిగా స్పందించింది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) భవిష్యత్ ప్రణాళికలపై చర్చించేందుకు బీసీసీఐ ఉన్నతాధికారులు నిన్న ముంబైలో సమావేశమయ్యారు. ఈ భేటీలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియాతో పాటు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, సీఓఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో వరల్డ్ కప్ మ్యాచ్‌ల అంశంపై ఎలాంటి చర్చ జరగలేదని, కేవలం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు సంబంధించిన విషయాలను మాత్రమే చర్చించినట్లు దేవజిత్ సైకియా తెలిపారు.

అలానే సీఓఈలో ఖాళీగా ఉన్న హెడ్ ఆఫ్ క్రికెట్ ఎడ్యుకేషన్, హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ పోస్టులను భర్తీ చేసేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల తరలింపు అనేది తమ పరిధిలోని అంశం కాదని, దానిపై ఐసీసీయే తుది నిర్ణయం తీసుకుంటుందని సైకియా స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, ఇటీవల భారత్ - బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్‌ -2026 నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇదే అంశం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ పరిస్థితుల మధ్యే 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌లో మ్యాచ్‌లు ఆడలేమని పేర్కొంటూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని కోరుతూ ఐసీసీకి బీసీబీ లేఖ రాసినట్లు సమాచారం. ఈ అభ్యర్థనను ఐసీసీ ఇప్పటికే తిరస్కరించినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడిస్తున్నప్పటికీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరోమారు ఐసీసీకి లేఖ పంపినట్లు తెలుస్తోంది. 
BCCI
Bangladesh cricket
T20 World Cup 2026
ICC
Devajit Saikia
Rajeev Shukla
VVS Laxman
India Bangladesh relations
Mustafizur Rahman
BCB

More Telugu News