ఫోన్లలో అన్నీ చూస్తున్నప్పుడు సినిమాల్లో కట్స్ ఎందుకు?.. సెన్సార్ బోర్డుకు కాలం చెల్లింది: రామ్ గోపాల్ వర్మ

  • ఫోన్లలో పిల్లలు కూడా హింస, పోర్న్ చూస్తున్నప్పుడు సినిమా కట్స్ ఓ జోక్ అన్న వర్మ
  • సెన్సార్‌షిప్ కాదు, కంటెంట్ హెచ్చరికలు, ఏజ్ క్లాసిఫికేషన్ సరైనవని వెల్లడి
  • దీనిపై పరిశ్రమ మొత్తం కలిసికట్టుగా పోరాడాలని పిలుపు
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డుపై, దాని పనితీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సెన్సార్ బోర్డు అనేది కాలం చెల్లిన వ్యవస్థ అని, దాని ఉనికి ఒక పెద్ద జోక్ అని ఆయన అభిప్రాయపడ్డారు. నటుడు విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’ సినిమా సెన్సార్ వివాదం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

"ఈ రోజుల్లో సెన్సార్ బోర్డుకు ఇంకా ప్రాముఖ్యత ఉందని భావించడం అవివేకం. దాని అవసరం ఎప్పుడో తీరిపోయింది. కానీ దానిపై చర్చించే బద్ధకంతో దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. దీనికి ప్రధాన బాధ్యత చిత్ర పరిశ్రమదే" అని వర్మ అన్నారు. "ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలంలో 12 ఏళ్ల పిల్లాడు కూడా గోప్రో కెమెరాతో చిత్రీకరించిన టెర్రరిస్ట్ హత్యను ఫోన్‌లో చూడగలడు. 9 ఏళ్ల చిన్నారికి హార్డ్‌కోర్ పోర్న్ సైట్లు తారసపడొచ్చు. విపరీతమైన భావజాలాన్ని, కుట్ర సిద్ధాంతాలను ఎవరైనా, ఎక్కడైనా, ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడొచ్చు. అన్నీ ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు న్యూస్ ఛానళ్ల నుంచి యూట్యూబర్ల వరకు సమాజంలో ప్రతి ఒక్కరూ బూతులు మాట్లాడుతున్నారు" అని వర్మ ప్రస్తుత పరిస్థితిని వివరించారు.

సినిమా శక్తిమంతమైన మాధ్యమం అనే పాత వాదనను ప్రస్తావిస్తూనే, అంతకంటే సోషల్ మీడియాకు ఎక్కువ విస్తృతి ఉందని, అది రాజకీయ విషం, మతపరమైన విద్వేషం, వ్యక్తిత్వ హననాలతో నిండి ఉందని వర్మ అన్నారు. "ఇలాంటి వాస్తవ పరిస్థితుల్లో ఒక సినిమాలో పదాన్ని కట్ చేయడం, షాట్‌ను ట్రిమ్ చేయడం, సిగరెట్‌ను బ్లర్ చేయడం ద్వారా సమాజాన్ని రక్షిస్తున్నామని సెన్సార్ బోర్డు నమ్మడం హాస్యాస్పదంగా ఉంది" అని ఆయన ఎద్దేవా చేశారు.

సెన్సార్ బోర్డు పుట్టింది ప్రసార మాధ్యమాలు పరిమితంగా, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న కాలంలోనని వర్మ గుర్తు చేశారు. అప్పట్లో నియంత్రణకు అర్థం ఉందని, కానీ ఇప్పుడు ఎవరూ ఏం చూడాలో, చూడకూడదో నిర్ణయించలేని పరిస్థితుల్లో నియంత్రణ అసాధ్యమని స్పష్టం చేశారు. "ఇలాంటి సమయంలో సెన్సార్‌షిప్ అనేది ప్రజలను కాపాడదు, కేవలం ప్రేక్షకుల తెలివితేటలను అవమానిస్తుంది. మనల్ని పాలించే నాయకులను ఎన్నుకునేంత తెలివి మనకుందని నమ్ముతారు, కానీ మనం ఏం చూడాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ మనకు లేదా?" అని ఆయన ప్రశ్నించారు.

సెన్సార్ బోర్డు ఇప్పుడు చేస్తున్నది రక్షణ కాదని, కేవలం అధికార ప్రదర్శన అని వర్మ ఆరోపించారు. కొందరి వ్యక్తిగత అభిరుచులు, పక్షపాతాలు, ఎజెండాలను ప్రజా నైతికత పేరుతో రుద్దుతున్నారని విమర్శించారు. వయసుల వారీగా వర్గీకరణ (Age classification), కంటెంట్ హెచ్చరికలు ఇవ్వడం సరైన పద్ధతి అని, కానీ కత్తెర్లు వాడటం సరికాదని ఆయన తేల్చిచెప్పారు. 

"గోడలు పగిలిపోయి, లోపల ఉన్నది ప్రతీ ఒక్కరికీ కనిపిస్తున్న భవనానికి వాచ్‌మెన్‌ను పెట్టడం ఎంత అవివేకమో, ఈ రోజుల్లో సెన్సార్ బోర్డును సమర్థించడం కూడా అంతే" అని వర్మ పోల్చారు. తమ కాలం చెల్లిపోయిందని అంగీకరించే ధైర్యం అధికారులకు, వారిని ప్రశ్నించే సంకల్పం చిత్ర పరిశ్రమకు ఉందా అని ఆయన నిలదీశారు. కేవలం ఒక సినిమాకు సమస్య వచ్చినప్పుడు కాకుండా, ఈ వ్యవస్థపైనే చిత్ర పరిశ్రమ సమష్టిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.


More Telugu News