గుజరాత్‌లో వరుస భూప్రకంపనలు.. గంటల వ్యవధిలో 12కు పైగా ప్రకంపనలు

  • గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రకంపనలు
  • రిక్టర్ స్కేలుపై తీవ్రత 2.6 నుంచి 3.8 మధ్య నమోదు
  • భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగు తీసిన ప్రజలు
గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు 12 సార్లకు పైగా భూప్రకంపనలు సంభవించడంతో రాజ్‌కోట్ జిల్లాలో భయాందోళనలు నెలకొన్నాయి. చాలామంది ఇళ్ల నుంచి బయటకు వచ్చి బహిరంగ ప్రదేశాల్లోనే ఉండిపోయారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.6 నుంచి 3.8 మధ్య నమోదయింది.

పాత భవనాల్లోని కొన్ని పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల నుంచి ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. గంటల వ్యవధిలోనే పలుమార్లు భూమి కంపించడంతో ప్రజలు భయపడి ఇళ్లలో నుంచి బయటకు పరుగు తీశారు. ఉప్లేటా, ధొరాజీ, జెత్‌పూర్ తాలుకాల్లో ఈ ప్రకంపనలు సంభవించాయి.

గురువారం రాత్రి 8.42 గంటల ప్రాంతంలో తొలిసారి భూమి కంపించిందని రాజ్‌కోట్ జిల్లా కలెక్టర్ తెలిపారు. భూకంప కేంద్రం ఉప్లేటా పట్టణంలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. భూమి పొరల్లో అప్పటికే ఉన్న చీలికల మధ్యకు నీరు చేరి ఒత్తిడి తీవ్రమైనప్పుడు ఇలా భూమి పలుమార్లు కంపిస్తుందని ఆయన వివరించారు.


More Telugu News