ఏపీలో టెట్ ఫలితాలు వచ్చేశాయ్!

  • ఏపీ టెట్ 2025 ఫలితాలు అధికారికంగా విడుదల
  • మొత్తం 39.27 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు
  • పరీక్షకు హాజరైన వారిలో 97,560 మంది అర్హత
  • అధికారిక వెబ్‌సైట్లతో పాటు వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు
  • ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల్లో 47.82 శాతం మంది పాస్
ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్-2025) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో మొత్తం 39.27 శాతం మంది అభ్యర్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది డిసెంబర్ 10 నుంచి 21 వరకు ఈ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఏపీ టెట్ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి ఫలితాల వివరాలను మీడియాకు వెల్లడించారు. టెట్‌కు మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేసుకోగా, 2,48,427 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 97,560 మంది అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల్లో ఉత్తీర్ణత శాతం కాస్త మెరుగ్గా నమోదైంది. పరీక్షకు హాజరైన 31,886 మంది ఇన్‌సర్వీస్ టీచర్లలో 15,239 మంది (47.82 శాతం) పాసయ్యారు.

ప్రాథమిక కీ విడుదల తర్వాత అభ్యర్థుల నుంచి అందిన అభ్యంతరాలను నిపుణుల కమిటీతో పరిశీలించి, తుది కీతో పాటు ఫలితాలను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను aptet.apcfss.in ... cse.ap.gov.in వంటి అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. వీటితో పాటు 9552300009 అనే వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ పంపి కూడా ఫలితాలను పొందవచ్చని సూచించారు.


More Telugu News