పగటి వెలుతురుతో షుగర్ వ్యాధి కట్టడి... ఆసక్తికర వివరాలు ఇవిగో!

  • పగటి వెలుతురు డయాబెటిస్ రోగుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని వెల్లడి
  • రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ సేపు సాధారణ స్థాయిలో ఉంటాయని గుర్తింపు
  • జీవక్రియ మెరుగుపడటంతో పాటు నిద్రకు సహకరించే మెలటోనిన్ స్థాయిలు వృద్ధి
  • స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ విశ్వవిద్యాలయాల పరిశోధనలో కీలక అంశాలు
టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి పగటిపూట సహజ కాంతి ఎంతో మేలు చేస్తుందని ఓ కొత్త అధ్యయనం తేల్చింది. సహజ కాంతిలో ఎక్కువ సేపు గడిపేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగ్గా అదుపులో ఉంటున్నాయని, జీవక్రియ కూడా మెరుగుపడుతుందని స్విట్జర్లాండ్‌లోని జెనీవా విశ్వవిద్యాలయం, నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్ట్ విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. ఈ అంశంపై సహజ కాంతి చూపే సానుకూల ప్రభావాన్ని నిరూపించిన మొదటి అధ్యయనం ఇదే కావడం విశేషం.

పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం, సహజ కాంతిలో సమయం గడిపిన వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువ గంటల పాటు సాధారణ పరిధిలోనే ఉన్నాయి. అంతేకాకుండా, సాయంత్రం వేళ నిద్రకు సహకరించే మెలటోనిన్ హార్మోన్ స్థాయిలు పెరిగినట్లు, కొవ్వుల జీవక్రియ కూడా మెరుగుపడినట్లు వెల్లడించారు. శరీరంలోని అంతర్గత గడియారం (సర్కేడియన్ రిథమ్) దెబ్బతినడం వల్లే జీవక్రియ సంబంధిత వ్యాధులు పెరుగుతాయని నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు.

ఈ అధ్యయనం కోసం, టైప్ 2 డయాబెటిస్ ఉన్న 65 ఏళ్లు పైబడిన 13 మందిని ఎంపిక చేశారు. వారిని రెండు సెషన్లలో భాగంగా 4.5 రోజుల పాటు ప్రత్యేక గదుల్లో ఉంచారు. ఒక సెషన్‌లో సహజ కాంతి వచ్చేలా, మరో సెషన్‌లో కృత్రిమ లైట్ల వెలుతురులో ఉంచి వారి ఆరోగ్యాన్ని విశ్లేషించారు. 

సహజ కాంతి వల్ల మెదడులోని కేంద్ర గడియారానికి, ఇతర అవయవాల్లోని గడియారాలకు మధ్య సమన్వయం మెరుగుపడుతుందని, దీనివల్లే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటున్నాయని పరిశోధకులు వివరించారు. ఈ అధ్యయన వివరాలు 'సెల్ మెటబాలిజం' అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


More Telugu News