తమీమ్ ఇక్బాల్ ‘ఇండియన్ ఏజెంట్’ అంటూ బంగ్లా క్రికెట్ బోర్డు సభ్యుడి తీవ్ర వ్యాఖ్యలు
- టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను ఇండియాలో ఆడలేమన్న బంగ్లాదేశ్
- ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు బాగా ఆలోచించుకోవాలన్న తమీమ్
- తమీమ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన నజ్ముల్ ఇస్లామ్
బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ పై ఆ దేశ క్రికెట్ బోర్డ్ సభ్యుడు నజ్ముల్ ఇస్లామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమీమ్ ఇక్బాల్ ఓ ఇండియన్ ఏజెంట్ అని ఆరోపించాడు. వివరాల్లోకి వెళితే... వచ్చే నెల 7 నుంచి మార్చి 8 మధ్య భారత్, శ్రీలంక వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. అయితే భద్రతా కారణాలను చూపుతూ తమ జట్టు భారత్ లో ఆడలేదని, తటస్థ వేదికపై తమ మ్యాచ్ లను నిర్వహించాలని ఐసీసీకి బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) ఓ మెయిల్ పంపింది.
ఈ విషయంపై బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు 90 నుంచి 95 శాతం ఆదాయం ఐసీసీ నుంచే వస్తుందని, కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు భవిష్యత్తు గురించి బాగా ఆలోచించుకోవాలని సూచించాడు. ప్రస్తుతం తనకు క్రికెట్ తో సంబంధాలు లేవని, సాధారణ పౌరుడిలాగే మీడియా ద్వారా విషయాలు తెలుసుకుంటున్నానని, ఎక్కువ సమాచారం తన వద్ద లేదని చెప్పాడు. అయితే, నిర్ణయాలు తీసుకునేముందు అంతర్గత చర్చలు జరగాలని అన్నాడు. ఒక్కసారి మాట జారిపోతే వెనక్కి తీసుకోవడం కష్టమని హెచ్చరించాడు.
కానీ ఈ వ్యాఖ్యలను బీసీబీ సభ్యుడు నజ్ముల్ ఇస్లామ్ తప్పుబట్టారు. తమీమ్‌ను 'ఇండియన్ ఏజెంట్' అని ఆరోపించారు. "అతడు ఇండియన్ ఏజెంట్ అనేది ఇప్పుడు దేశం మొత్తానికి నిరూపితమైంది" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.