Talasani Srinivas Yadav: సికింద్రాబాద్ గుర్తింపును దెబ్బతీసే కుట్ర జరుగుతోంది: తలసాని శ్రీనివాస్ యాదవ్
- సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలన్న తలసాని
- 11వ తేదీన కీలక సమావేశం నిర్వహిస్తామని ప్రకటన
- 17న భారీ ర్యాలీ నిర్వహిస్తామన్న తలసాని
సికింద్రాబాద్‌కు ఉన్న ఘనమైన చరిత్రను, ప్రత్యేక గుర్తింపును దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, సనత్‌నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పద్మారావునగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... సికింద్రాబాద్ అస్థిత్వం కాపాడుకోవడం కోసం ప్రజలంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్‌ను ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 11వ తేదీన బాలంరాయిలోని లీ ప్యాలెస్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తలసాని తెలిపారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ వాణిజ్య, వ్యాపార, కార్మిక సంఘాల నేతలు, కాలనీలు, బస్తీల కమిటీ ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు నిర్వహించనున్న భారీ ర్యాలీతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు.
సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తలసాని హెచ్చరించారు. అవసరమైతే దశలవారీగా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, ఇతర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన పోరాటం కాదని, సికింద్రాబాద్ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన ఉద్యమమని ఆయన పేర్కొన్నారు.
ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా, సికింద్రాబాద్ చరిత్రను, సంస్కృతిని పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని తలసాని విమర్శించారు. ఇలాంటి నిర్ణయాలు నియంతృత్వ ధోరణిని స్పష్టంగా చూపిస్తున్నాయని అన్నారు. సికింద్రాబాద్ ప్రత్యేకతను కాపాడుకోవాలంటే ప్రజలంతా ఒక్కటై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.