BR Naidu: తిరుమలలో రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనాలు... వివరాలు వెల్లడించిన టీటీడీ

Tirumala Vaikunta Darshan Sees Record Pilgrim Turnout Confirms TTD
  • విజయవంతంగా ముగిసిన తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు
  • రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం
  • 10 రోజుల్లో రూ.41 కోట్ల హుండీ ఆదాయం, 44 లక్షల లడ్డూల విక్రయం
  • టీటీడీ ఏర్పాట్లపై 93 శాతం భక్తులు పూర్తి సంతృప్తి
  • ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్‌తో క్యూలైన్ల పర్యవేక్షణ విజయవంతం
కలియుగ వైకుంఠం తిరుమలలో 10 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా ముగిశాయి. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు సాగిన ఈ దర్శనాల్లో టీటీడీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై 93 శాతం భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం ఆనందంగా ఉందన్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో 6.83 లక్షల మంది, 2023లో 6.47 లక్షల మంది దర్శించుకోగా, ఈసారి ఆ సంఖ్య భారీగా పెరిగింది. ఈ 10 రోజుల్లో శ్రీవారి హుండీ ద్వారా రూ.41 కోట్ల ఆదాయం సమకూరింది. రికార్డు స్థాయిలో 44 లక్షల లడ్డూలు విక్రయించామని చైర్మన్ వివరించారు. గతేడాదితో పోలిస్తే ఇది 10 లక్షల లడ్డూలు అధికం. అన్నప్రసాదాల వితరణ కూడా 27 శాతం పెరిగినట్లు తెలిపారు.

పక్కా ప్రణాళిక, ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షించడం వల్లే అంచనాలకు మించి భక్తులకు దర్శనం కల్పించగలిగామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. కల్యాణకట్ట, పారిశుద్ధ్యం, వైద్య సేవలు భక్తులకు ఎంతో ఉపయుక్తంగా నిలిచాయని చెప్పారు. 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లతో చేసిన అద్భుత అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని పేర్కొన్నారు.

"ఈ వైకుంఠ ద్వార దర్శనాలను శాంతియుతంగా విజయవంతం చేసిన భక్తులకు, అహర్నిశలు శ్రమించి మెరుగైన సేవలు అందించిన అధికారులు, సిబ్బంది మరియు సేవకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
BR Naidu
TTD
Tirumala
Vaikunta Dwara Darshanam
Sri Venkateswara Swamy
Laddus
Hundi collection
pilgrims
Andhra Pradesh
Hindu Temple

More Telugu News