Donald Trump: గ్రీన్‌లాండ్‌ను దక్కించుకునేందుకు ట్రంప్ సరికొత్త వ్యూహం.. పౌరులకు నేరుగా డబ్బు ఆఫర్!

Donald Trump Offers Money to Greenland Citizens for US Acquisition
  • గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికా సరికొత్త ప్రయత్నాలు
  • డెన్మార్క్ నుంచి విడిపోయేందుకు పౌరులకు నేరుగా డబ్బు ఆఫర్
  • దాడికి పాల్పడితే కాల్చివేస్తామని అమెరికాను హెచ్చరించిన డెన్మార్క్ సైన్యం
  • జాతీయ భద్రత, ఖనిజాల కోసమే గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ పట్టు
  • అమెరికాలో చేరేందుకు సుముఖంగా లేని గ్రీన్‌లాండ్‌ ప్రజలు
డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్‌లాండ్‌ను తమ దేశంలో విలీనం చేసుకునేందుకు అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాతో కలిసేలా అక్కడి ప్రజలను ఒప్పించేందుకు, ప్రతి పౌరుడికి నేరుగా నగదు చెల్లించే ప్రతిపాదనపై వైట్‌హౌస్‌లో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో వెల్లడించింది.

గ్రీన్‌లాండ్‌లోని 57,000 మంది పౌరులలో ఒక్కొక్కరికి 10,000 డాలర్ల నుంచి 1,00,000 డాలర్ల వరకు చెల్లించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మొత్తం దాదాపు 6 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా. అయితే, గ్రీన్‌లాండ్‌ను అమ్మే ప్రసక్తే లేదని డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌ ప్రభుత్వాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అంతేగాక‌ ఆర్కిటిక్ ప్రాంతంలోని తమ భూభాగంలోకి ఎవరైనా అడుగుపెడితే, ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూడకుండా వెంటనే కాల్పులు జరపాలని తమ సైనికులకు ఆదేశాలున్నాయని డెన్మార్క్ హెచ్చరించడం ఉద్రిక్తతకు దారితీసింది.

జాతీయ భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలు, సైనిక అవసరాలకు ఉపయోగపడే అపారమైన ఖనిజ సంపద దృష్ట్యా గ్రీన్‌లాండ్ తమకు ఎంతో కీలకమని ట్రంప్ చాలాకాలంగా వాదిస్తున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు నగదు చెల్లింపులతో పాటు సైనిక చర్య లేదా 'కాంపాక్ట్ ఆఫ్ ఫ్రీ అసోసియేషన్' (COFA) ఒప్పందం వంటి ఇతర మార్గాలను కూడా ట్రంప్ యంత్రాంగం పరిశీలిస్తోంది. సీఓఎఫ్ఏ ఒప్పందం ప్రకారం అమెరికా రక్షణ కల్పిస్తుంది, కానీ ఆ దేశంలో వారి సైన్యం స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది.

అయితే, గ్రీన్‌లాండ్‌ ప్రజలు డెన్మార్క్ నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటున్నప్పటికీ, అమెరికాలో విలీనం కావడానికి మాత్రం సుముఖంగా లేరని సర్వేలు చెబుతున్నాయి. "గ్రీన్‌లాండ్‌ను ఆక్రమించుకోవాలనే ఫాంటసీలను ఆపండి" అని ఆ దేశ ప్రధాని జెన్స్-ఫ్రెడెరిక్ నీల్సన్ ఇప్పటికే ట్రంప్‌ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికా వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.
Donald Trump
Greenland
Denmark
United States
acquisition
offer
citizens
COFA
military

More Telugu News