Ram Gopal Varma: ఆమె చాలా మంది మగ దర్శకుల కంటే ముందున్నారు.. ‘టాక్సిక్’ డైరెక్టర్‌ను ఆకాశానికెత్తిన ఆర్జీవీ

RGV Praises Geetu Mohandas Toxic Movie Direction
  • యశ్‌ ‘టాక్సిక్’ టీజర్‌కు అద్భుతమైన స్పందన
  • దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌పై రామ్ గోపాల్ వర్మ ప్రశంసల వర్షం
  • స్టైలిష్ యాక్షన్‌తో సినిమాపై భారీగా పెరిగిన అంచనాలు
  • 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్త విడుదల కానున్న సినిమా
రాకింగ్ స్టార్ యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా టీజర్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న య‌శ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుదలైన ఈ టీజర్, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తూ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం, టీజర్‌తోనే తన మేకింగ్ స్టైల్‌ను బలంగా పరిచయం చేశారు. ముఖ్యంగా ఒక మహిళా దర్శకురాలు ఇంతటి రా, రస్టిక్ యాక్షన్ కాన్సెప్ట్‌ను తెరకెక్కించడంపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని రాజేశాయి. ‘టాక్సిక్’ టీజర్‌ను ప్రశంసిస్తూ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ను ఆకాశానికెత్తేశారు. “ఇది మహిళా సాధికారతకు నిలువెత్తు ఉదాహరణ” అని పేర్కొంటూ, ఇంత పవర్‌ఫుల్ విజువల్స్ సృష్టించడంలో ఆమె చాలా మంది మగ దర్శకుల కంటే ముందున్నారని అన్నారు. ఆమె విజన్‌కు తాను ఆశ్చర్యపోయానని వర్మ వ్యాఖ్యానించారు.

టీజర్‌లో చూపిన విజువల్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. శ్మశానంలో అంత్యక్రియల సన్నివేశం, మాఫియా డాన్‌లు, లగ్జరీ కారులో యశ్‌ స్టైలిష్ ఎంట్రీ, ఆ వెంటనే జరిగే పేలుడు.. ఈ మొత్తం సీక్వెన్స్‌ను ఎంతో స్టైలిష్‌గా చిత్రీకరించారని మెచ్చుకుంటున్నారు. విధ్వంసాన్ని కూడా ఎంతో ఎలిగెన్స్‌తో చూపించడం గీతూ మేకింగ్‌లోని ప్రత్యేకతగా అభివర్ణిస్తున్నారు.

సోషల్ మీడియాలో కూడా ఈ టీజర్‌పై భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు గీతూ మోహన్‌దాస్ ఇండియన్ సినిమాకు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారని ప్రశంసిస్తుండగా, గతంలో హింసను వ్యతిరేకించిన ఆమె ఇప్పుడు గ్లోరిఫైడ్ వయలెన్స్‌తో సినిమా తీయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా ఈ చిత్రం ఇండస్ట్రీలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించడం ఖాయమనిపిస్తోంది. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2026 మార్చి 19న సినిమాను విడుదల చేయనున్నట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే అధికారికంగా ప్రకటించారు.
Ram Gopal Varma
Yash
Toxic Movie
Geetu Mohandas
Nayanthara
Kiara Advani
Telugu Cinema
Indian Film
Action Movie
Yash Birthday

More Telugu News