Jaishankar: యూఎస్‌లో 670 కిలోమీటర్లు రోడ్డుమార్గంలోనే ప్రయాణించిన జైశంకర్‌

Jaishankar Travels 670 km by Road in US Due to Shutdown
  • అమెరికాలో షట్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు
  • మంత్రి జైశంకర్ కోసం 670 కి.మీ. రోడ్డు మార్గంలో ప్రత్యేక ప్రయాణం
  • భద్రతా విధుల్లో పాల్గొన్న 27 మంది అమెరికన్ ఏజెంట్లు
  • ఐక్యరాజ్యసమితి చీఫ్‌తో భేటీ అయ్యేందుకు ప్రత్యేక ఏర్పాట్లు
  • తీవ్రమైన చలి, ప్రతికూల వాతావరణంలోనూ సాగిన ఆపరేషన్
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కోసం యూఎస్ భద్రతా అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఐక్యరాజ్యసమితి (ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌తో ముందుగా ఖరారైన సమావేశానికి ఆయన్ను చేర్చేందుకు ఏకంగా 416 మైళ్లు (సుమారు 670 కిలోమీటర్లు) రోడ్డు మార్గంలో ప్రయాణించారు.

ఈ ఘటన గత సెప్టెంబర్‌లో జరగ్గా, అమెరికా విదేశాంగ శాఖకు చెందిన డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీస్ (డీఎస్ఎస్‌) ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. షట్‌డౌన్ వల్ల విమానాలు అందుబాటులో లేకపోవడంతో యూఎస్-కెనడా సరిహద్దులోని లూయిస్టన్-క్వీన్స్‌టన్ బ్రిడ్జి వద్ద మంత్రి జైశంకర్‌ భద్రతను ఏజెంట్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను న్యూయార్క్‌లోని మాన్‌హాటన్‌కు చేర్చడానికి సుమారు ఏడు గంటల సమయం పట్టింది.

ఈ ఆపరేషన్‌లో మొత్తం 27 మంది ఏజెంట్లు పాల్గొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తీవ్రమైన చలి, మంచు కారణంగా దారి సరిగ్గా కనిపించకపోయినా, డ్రైవర్లను మార్చుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించారు. మార్గమధ్యంలో ఒకచోట పేలుడు పదార్థాలను గుర్తించే జాగిలం మంత్రి వాహనంపై అనుమానంతో హెచ్చరించింది. దీంతో వెంటనే ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్న ఏజెంట్లు, వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి క్లియరెన్స్ ఇచ్చాక ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు.

అంతేగాక‌ న్యూయార్క్ నగరానికి చేరుకున్నాక, ఓ హిట్ అండ్ రన్ ప్రమాదంలో గాయపడిన మహిళకు భద్రతా బృందంలోని ఒక ఏజెంట్ సహాయం అందించారు. ఈ అనూహ్య సంఘటనలు ఎదురైనా మంత్రి భద్రతకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుని, ఆయన ఐరాస సమావేశంలో పాల్గొనేలా చేశామని డీఎస్ఎస్‌ తన నివేదికలో పేర్కొంది.
Jaishankar
S Jaishankar
Indian Foreign Minister
US government shutdown
António Guterres
United Nations
Diplomatic Security Service
US Canada border
New York
road trip

More Telugu News