Vijay: విజయ్ సినిమాకు లైన్ క్లియర్.. ఇంతలోనే మరో ట్విస్ట్!
- సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో విడుదల కాని విజయ్ సినిమా 'జననాయగన్'
- సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ బోర్డును ఆదేశించిన హైకోర్టు సింగిల్ బెంచ్
- సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ లో సవాలు చేసిన సెన్సార్ బోర్డు
తమిళ స్టార్, దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ మూవీ విడుదల అంశం ఎట్టకేలకు కీలక మలుపు తిరిగింది. ఈ సినిమాకు U/A సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ సీబీఎఫ్‌సీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సినిమా ఇప్పటికే యూఏ సర్టిఫికేట్‌కు అర్హమని భావించినప్పుడు, మళ్లీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏముందని కోర్టు సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. ముందే యూఏ సర్టిఫికేట్ ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఆలస్యం చేయకుండా వెంటనే సర్టిఫికేట్ జారీ చేయాలని సీబీఎఫ్‌సీకి ఆదేశాలు ఇచ్చింది.
దీంతో, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సెన్సార్ బోర్డు వెంటనే మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు వెలువడిన కొద్ది సేపటికే డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మధ్యాహ్నం విచారణ జరపనుంది.
డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో, దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జననాయగన్’ సినిమాను సంక్రాంతి కానుకగా ఈరోజు (జనవరి 9) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ముందుగా ప్రకటించారు. కానీ అనూహ్యంగా సెన్సార్ సర్టిఫికేట్ జారీ కాకపోవడంతో విడుదల వాయిదా పడింది. ఈ పరిణామం విజయ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో సినిమా విడుదలపై మరోసారి ఆశలు చిగురించాయి. ఇక డివిజన్ బెంచ్ తీర్పు ఎలా ఉంటుందన్నదానిపై ఆసక్తి నెలకొంది.