TTD: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం.. రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేత

Srivari Mettu Pilgrim Route Suspended After Leopard Sighting
  • శ్రీవారి మెట్టు మార్గంలో 400వ మెట్టు వద్ద చిరుత సంచారం
  • గమనించిన భక్తులు వెంటనే అధికారులకు సమాచారం అందించిన వైనం
  • భద్రతా చర్యగా నడక మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసిన టీటీడీ 
  • భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు 
తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఈ మార్గంలోని 400వ మెట్టు సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు కొందరు భక్తులు గుర్తించి, వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు శుక్రవారం ఉదయం శ్రీవారి మెట్టు మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. మార్గం మొత్తం విస్తృతంగా తనిఖీలు చేపట్టి, చిరుత కదలికలు లేవని నిర్ధారించుకున్న తర్వాత భక్తులను తిరిగి అనుమతించారు. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా కాకుండా గుంపులుగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, భక్తులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

గత కొంతకాలంగా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం తరచుగా నమోదవుతుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే టీటీడీ ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘాను పటిష్ఠం చేసింది. రాత్రి వేళల్లో భక్తులను గుంపులుగా అనుమతించడం, అటవీ ప్రాంతాల్లో ఆహార పదార్థాలు పడేయవద్దని సూచించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.
TTD
Tirumala
Srivari Mettu
Leopard
Alipiri
Pilgrim Route
Tirupati
Wildlife
Andhra Pradesh
Security

More Telugu News