Pawan Kalyan: మడ అడవుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan Comments on Mangrove Forest Conservation
  • పాత మడ అడవులను కాపాడటం, కొత్తవాటిని పెంచడం ప్రభుత్వ లక్ష్యమన్న పవన్
  • రాష్ట్ర తీర ప్రాంతానికి మడ అడవులు రక్షణ గోడలాంటివన్న డిప్యూటీ సీఎం
  • 700 హెక్టార్లలో మడ అడవుల అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి

తీర ప్రాంత భద్రత, పర్యావరణ పరిరక్షణ విషయంలో మడ అడవులు ఎంత కీలకమో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టంగా తెలియజేశారు. సముద్రపు అలలు, తుపాన్లు, ప్రకృతి వైపరీత్యాల నుంచి తీరాన్ని కాపాడే సహజ రక్షణ కవచం మడ అడవులేనని ఆయన పేర్కొన్నారు. పాత మడ అడవులను కాపాడటం, కొత్తగా మడ అడవులను పెంచడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.


రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రారంభమైన ‘మడ అడవుల పెంపుదల – సుస్థిర ఆదాయం’ అంశంపై జాతీయ స్థాయి రెండు రోజుల వర్క్‌షాప్‌లో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 1052 కిలోమీటర్ల పొడవైన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి మడ అడవులు రక్షణ గోడలాంటివని అన్నారు. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో తుపాన్ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడ మడ అడవుల విస్తరణ అత్యంత అవసరమని స్పష్టం చేశారు.


ఉన్న మడ అడవులను సంరక్షించడమే కాకుండా, కొత్తగా వాటిని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. 2025లోనే రాష్ట్ర తీర ప్రాంతంలో 700 హెక్టార్లలో మడ అడవుల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. తీర ప్రాంతంలో మూడు దశల గ్రీన్ బెల్ట్ అభివృద్ధి ప్రణాళిక అమలులో ఉందని, దీని ద్వారా ప్రకృతి వైపరీత్యాల నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు.


మడ అడవులు కేవలం పర్యావరణ రక్షణకే పరిమితం కాకూడదని, తీర ప్రాంత ప్రజలకు సుస్థిర ఆదాయ మార్గాలుగా కూడా మారాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అందుకే ఎకో టూరిజం, స్కిల్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతున్నామని తెలిపారు. అటవీ నర్సరీల ద్వారా గిరిజనులు, స్థానికులకు ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Pawan Kalyan
Andhra Pradesh
Mangrove forests
Coastal security
Environmental protection
Godavari Delta
Krishna Delta
Eco tourism
Green belt development

More Telugu News