Nara Lokesh: ఏపీకి 'చీఫ్ జాబ్ క్రియేటర్'... మంత్రి నారా లోకేశ్ పై 'ది వీక్' కవర్ పేజీ కథనం

Nara Lokesh Featured as AP Chief Job Creator on The Week Cover
  • జాతీయ పత్రిక 'ది వీక్' తాజా కవర్ పేజీపై మంత్రి నారా లోకేశ్
  • ఏపీకి 'చీఫ్ జాబ్ క్రియేటర్'గా లోకేశ్ కు ప్రత్యేక గుర్తింపు
  • లోకేశ్ పాలన వేగవంతం, జవాబుదారీతనంతో ఉందని హోంమంత్రి అనిత ప్రశంస
  • 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' నినాదం కాదు, నిబద్ధత అని వెల్లడి
  • యువత, ఉద్యోగాలే లక్ష్యంగా ఏపీకి పెట్టుబడులు ఆకర్షిస్తున్నారని కితాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పాలన దక్షత, దార్శనికత జాతీయ స్థాయిలో విస్తృత గుర్తింపు పొందుతున్నాయి. ప్రతిష్ఠాత్మక జాతీయ పత్రిక 'ది వీక్' తమ కొత్త సంచికలో లోకేశ్ ఫొటోను కవర్ పేజీపై ప్రచురించి, 'ఏపీకి చీఫ్ జాబ్ క్రియేటర్' (ఉద్యోగాల సృష్టికర్త) అని అభివర్ణించింది. దీనిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. లోకేశ్ పాలనా శైలిపై, ఆయన లక్ష్యాలపై ప్రశంసల వర్షం కురిపించారు. 

లోకేశ్... పరిపాలనలో వేగం, ఆవిష్కరణలు, జవాబుదారీతనాన్ని తీసుకొస్తున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. "'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అనేది కేవలం నినాదం కాదని, అది ప్రజలకు, అవకాశాలకు ప్రభుత్వం ఇస్తున్న బలమైన నిబద్ధత అని" ఆమె స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి అనుభవం, స్పష్టమైన సంస్కరణల దృక్పథంతో లోకేశ్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఉద్యోగాలు, నైపుణ్యాలు, పెట్టుబడిదారుల విశ్వాసంపై లోకేశ్ ప్రత్యేకంగా దృష్టి సారించారని, ఇది ఆర్థిక వృద్ధిని ప్రజల ఉపాధిగా మార్చాలనే ఆయన బలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమలకు అత్యంత ప్రాధాన్య గమ్యస్థానంగా మారుస్తున్నారని కొనియాడారు. పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వంపై నమ్మకం ఉంచడం, రాష్ట్రం సరైన దిశలో పయనిస్తోందన్న విశ్వాసాన్ని బలపరుస్తోందని ఆమె పేర్కొన్నారు.

కాగా, 'ది వీక్' మ్యాగజైన్ కూడా లోకేశ్ గురించి పలు ఆసక్తికర విషయాలను తన కవర్ పేజీపై హైలైట్ చేసింది. కేవలం మాటలు చెప్పడమే కాకుండా, చేతలతో వేగం చూపిస్తూ పెట్టుబడులను ఆకర్షించడమే లోకేశ్ లక్ష్యమని పేర్కొంది. స్టాన్‌ఫోర్డ్, కార్నెగీ మెలన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో ఆయన పొందిన ఉన్నత విద్య, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఊతమిస్తోందని తెలిపింది. 

"నేను కేవలం మంత్రిని కాదు, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే 'చీఫ్ జాబ్ క్రియేటర్'గా గుర్తింపు పొందాలనుకుంటున్నాను" అన్న ఆయన ఆశయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. తండ్రి చంద్రబాబు హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చిన స్ఫూర్తితో, లోకేశ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఒక పారిశ్రామిక శక్తి కేంద్రంగా (ఇండస్ట్రియల్ పవర్‌హౌస్‌) తీర్చిదిద్దుతున్నారని 'ది వీక్' విశ్లేషించింది. 
Nara Lokesh
Andhra Pradesh
AP Minister
The Week
Chief Job Creator
Vangalapudi Anitha
IT Minister
Education Minister
Industrial Powerhouse
Chandrababu Naidu

More Telugu News