Sankranti Holidays: ఖాళీ అవుతున్న హైదరాబాద్... కిటకిటలాడుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
- సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు పయనమవుతున్న జనాలు
- జనసంద్రాన్ని తలపిస్తున్న రైల్వే స్టేషన్లు
- ఇప్పటికే 150 ప్రత్యేక రైళ్లను అనౌన్స్ చేసిన దక్షిణ మధ్య రైల్వే
తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ లో నివసిస్తున్న కుటుంబాలు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు పయనమవుతున్నాయి. ఉదయం నుంచే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు ప్రయాణికులు పోటెత్తారు. సికింద్రాబాద్ స్టేషన్ అయితే పూర్తిగా రద్దీతో నిండిపోయింది. లగేజీలు, పిల్లలు, పెద్దలతో జనసంద్రం కనిపించింది.
ఈ రద్దీని ముందుగానే అంచనా వేసిన దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 150 స్పెషల్ ట్రైన్లను అనౌన్స్ చేసింది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, తిరుపతి వంటి ఏపీ ప్రాంతాలకు డిమాండ్ ఆకాశాన్నంటడంతో అదనపు సర్వీసులు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ స్టేషన్ పై ఒత్తిడి తగ్గించేందుకు... జనవరి 7 నుంచి 20 వరకు 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో తాత్కాలిక హాల్ట్ కల్పించారు. దీనివల్ల ఐటీ కారిడార్‌లో ఉండే ఉద్యోగులు సికింద్రాబాద్ రాకుండా నేరుగా హైటెక్ సిటీలోనే రైలు ఎక్కే సౌకర్యం లభిస్తుంది, ఇది చాలా మందికి భారీ రిలీఫ్‌గా మారింది.
సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్న కారణంగా ప్లాట్‌ఫామ్ 10 వైపు పార్కింగ్, ఎగ్జిట్ మార్గాలు మార్చారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా అదనపు సిబ్బంది, పోలీసు బలగాలను మోహరించారు. ఇక అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు తీసుకునేవాళ్లు ‘రైల్ వన్’ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే 3 శాతం డిస్కౌంట్ లభిస్తుందని రైల్వే అధికారులు చెప్పారు.