అమరావతిని జగన్ అడ్డుకోలేరు: మంత్రి నారాయణ

  • జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి ఆగదని స్పష్టం చేసిన మంత్రి నారాయణ
  • అవగాహన లేకుండా అమరావతిపై జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శ
  • ఇలాగే మాట్లాడితే 11 సీట్లు కూడా సున్నా అవుతాయని హెచ్చరిక
  • మూడేళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడి
  • భూసమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని వెల్లడి
రాజధాని అమరావతి నిర్మాణం ఆగబోదని, వైసీపీ అధినేత జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదని పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ స్పష్టం చేశారు. అమరావతిపై జగన్‌కు పూర్తి అవగాహన లేదని, మిడిమిడి జ్ఞానంతో అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

నదీ గర్భంలో నిర్మాణాలు చేపడుతున్నామంటూ జగన్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి ఖండించారు. నదీ గర్భానికి, నదీ బేసిన్‌కు మధ్య ఉన్న తేడాను కూడా జగన్ తెలుసుకోలేకపోతున్నారని విమర్శించారు. రైతులు రెండో విడత భూసమీకరణకు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటం చూసి ఓర్వలేకే జగన్ అసూయతో అవాస్తవాలు మాట్లాడుతున్నారని నారాయణ ఆరోపించారు.

"ఏ రాష్ట్రానికైనా ఒకే రాజధాని ఉంటుంది. ప్రతి జిల్లాకు జిల్లా హెడ్‌క్వార్టర్ ఉంటుంది. ఈ వాస్తవాన్ని మరిచి జగన్ మాట్లాడుతున్నారు. ఇదే తీరుగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తే, ఆయనకు ఇప్పుడున్న 11 సీట్లు కూడా సున్నాకు పడిపోతాయి" అని మంత్రి నారాయణ హెచ్చరించారు.

అమరావతి నిర్మాణ ప్రణాళికను వివరిస్తూ, రాబోయే ఏడాదిన్నరలో ట్రంక్ రోడ్లు, రెండున్నరేళ్లలో లేఅవుట్ రోడ్లు పూర్తి చేస్తామని తెలిపారు. మూడేళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణం కూడా పూర్తవుతుందని, రాజధాని పనులు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయని ఆయన భరోసా ఇచ్చారు.


More Telugu News