బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులు.. హసీనా ఏమన్నారంటే..!

  • మతం పేరుతో హింసకు బంగ్లాదేశ్ లో చోటులేదన్న మాజీ ప్రధాని
  • తన పాలనలో ప్రజల్లో మతసామరస్యం పెంపొందించానని వెల్లడి 
  • మైనారిటీలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యతని  యూనస్ కు చురకలు
బంగ్లాదేశ్ లో ఇటీవల మైనారటీ హిందువులపై దాడులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దైవ దూషణ పేరుతో హిందూ యువకుడిని కొట్టి చంపిన ఘటన నుంచి మొదలుకొని దొంగతనం ఆరోపణలతో తరమడంతో హిందూ యువకుడు ఒకరు కాలువలో దూకి చనిపోవడం వరకు.. గృహ దహనాలు, మహిళలపై అత్యాచారాలు సహా పలు దారుణాలు జరుగుతున్నాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే మొత్తం 51 ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఈ దారుణ సంఘటనలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రస్తుతం భారత్ లో తలదాచుకుంటున్న షేక్ హసీనా తాజాగా స్పందించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హసీనా మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ లో మతపరమైన హింసకు తావులేదని చెప్పారు. తన హయాంలో ప్రజల్లో మతసామరస్యం పెంపొందించానని, మతంతో సంబంధం లేకుండా ప్రజలంతా కలిసిమెలిసి జీవించేలా ప్రోత్సహించానని తెలిపారు.

తన ప్రభుత్వం కూలిపోయాక బంగ్లాదేశ్ లో హింస పెరిగిపోయిందని, మైనారిటీలకు దేశంలో రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని మైనారిటీ వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ కనీస విధి అని, ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిలైందని ఆరోపించారు. ఈ విషయంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి యూనస్ విఫలయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దారుణ సంఘటనల వెనక మత కోణం లేదని బుకాయిస్తున్నాడని విమర్శించారు. ఇది బంగ్లాదేశ్ లోని మైనారిటీలకు మాత్రమే కాదు దేశ లౌకిక, ప్రజాస్వామ్య విధానాలకే ముప్పుగా మారుతుందని హసీనా హెచ్చరించారు.


More Telugu News