: జనాలు చెప్పులతో కొడతారు: కేతిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

  • రాయలసీమ పౌరుషంపై కేతిరెడ్డి వ్యాఖ్యల దుమారం
  • కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదన్న జేసీ ప్రభాకర్ రెడ్డి
  • గుడ్ మార్నింగ్ అంటూ షో చేయడం తప్ప ప్రజలకు ఏం చేశారని ప్రశ్న

రాయలసీమ ప్రజల పౌరుషంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేపాయి. కేతిరెడ్డి వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమకు పౌరుషం లేదని మాట్లాడటం దురహంకారమని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాయలసీమ ప్రజలు చెప్పులతో కొడతారని జేసీ ఘాటుగా హెచ్చరించారు.


తాను కూడా రాయలసీమ బిడ్డనేనని, తనకు పౌరుషం ఉందని చెప్పుకొచ్చిన జేసీ... కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదని విమర్శించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి, ఉప్పు కారం తిన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పుడు ఎక్కడ, ఆయన కొడుకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ధర్మవరంలో కేతిరెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. గుడ్ మార్నింగ్ అంటూ షో చేయడం తప్ప ప్రజలకు ఏం చేశారని ఎద్దేవా చేశారు.


మూడేళ్ల తర్వాత చూస్తామంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, దమ్ముంటే ఇప్పుడే రావాలని సవాల్ విసిరారు. మూడేళ్ల తర్వాత కాదు, ఇప్పుడే చూసుకుందాం రండి అంటూ ఛాలెంజ్ చేశారు. కేతిరెడ్డి వద్ద ఉన్న కార్లు, గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. నీటి ప్రాజెక్టులపై వైసీపీ రాజకీయాలు చేస్తే రైతులే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


సీఎం చంద్రబాబు మంచివాడు కాబట్టే ఇప్పటివరకు ఓపిక పట్టామని, ఆయన అభివృద్ధి కోసం తిరుగుతుంటే వైసీపీ నేతలు రప్పా రప్పా అంటూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇంకోసారి రాయలసీమ పేరు తీస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని జేసీ అన్నారు. దమ్ముంటే రాయలసీమ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని... చంద్రబాబు ఏం చేశారు, జగన్ ఏం చేశారో ప్రజల ముందే తేల్చుకుందాం అంటూ ఛాలెంజ్ విసిరారు. చీము, రక్తం ఉంటే తాడిపత్రికి రావాలని, అవసరమైతే మళ్లీ జైలుకు వెళ్లడానికి కూడా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు.

More Telugu News