Usman Khawaja: ఖవాజాకు ఘన వీడ్కోలు.. 'గార్డ్ ఆఫ్ ఆనర్'తో గౌరవించిన ఇంగ్లండ్ ప్లేయ‌ర్లు.. ఇదిగో వీడియో!

Usman Khawaja Receives Guard of Honor in Farewell Match
  • చివరి మ్యాచ్ ఆడిన ఉస్మాన్ ఖవాజాకు గార్డ్ ఆఫ్ ఆనర్
  • మైదానాన్ని ముద్దాడి భావోద్వేగంతో వీడ్కోలు
  • యాషెస్ సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
  • గెలుపుతో కెరీర్ ముగించడం ఎంతో ఆనందంగా ఉందన్న ఖవాజా
ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు భావోద్వేగాల మధ్య ఘనంగా వీడ్కోలు పలికాడు. తన చివరి మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి వస్తున్న అతనికి, ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు 'గార్డ్ ఆఫ్ ఆనర్' ఇచ్చి అరుదైన గౌరవాన్ని అందించారు.

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టు ఐదో రోజున ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. స్టీవ్ స్మిత్ ఔటైన తర్వాత ఖవాజా క్రీజులోకి రాగా, ఇంగ్లండ్ ఆటగాళ్లు వరుసలో నిలబడి అతనికి గౌరవ వందనం సమర్పించారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో కరచాలనం చేసి ఖవాజా బ్యాటింగ్‌కు దిగాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచి, యాషెస్ సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది.

తన చివరి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే ఔటైన ఖవాజా, మైదానం వీడే ముందు మోకాళ్లపై కూర్చుని పిచ్‌ను ముద్దాడాడు. అనంతరం ప్రేక్షకులకు అభివాదం చేస్తూ భావోద్వేగంతో పెవిలియన్ చేరాడు. విజయం తర్వాత ఖవాజా మాట్లాడుతూ.. "గెలుపుతో కెరీర్‌ను ముగించడం ఎంతో సంతృప్తినిచ్చింది. సహచరులతో కలిసి ఈ విజయాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలవాలని మాత్రమే కోరుకున్నాను. అదే జరిగింది" అని తెలిపాడు.

తన చివరి మ్యాచ్‌లో భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా కష్టంగా అనిపించిందని ఖవాజా అన్నాడు. "నా కెరీర్ మొత్తంలో ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకున్నాను. కానీ, ఈ మ్యాచ్‌లో ఏకాగ్రతతో ఆడటం కష్టమైంది. అయినా గెలుపుతో ఎస్‌సీజీలో కెరీర్ ముగించడం జీవితాంతం గుర్తుండిపోతుంది" అని వివరించాడు.
Usman Khawaja
Usman Khawaja retirement
Ashes series
England cricket
Australia cricket
Ben Stokes
Steve Smith
cricket farewell

More Telugu News