KCR: ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలవనున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ... కారణం ఇదే!
- మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ ను కలవనున్న మహిళా మంత్రులు
- మేడారం జాతరకు మాజీ సీఎంకు ఆహ్వాన పత్రిక అందించనున్న వైనం
- జనవరి 28 నుంచి నాలుగు రోజుల పాటు జాతర
తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మంత్రులు సీతక్క, కొండా సురేఖ కలవబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని ఆయన ఫాంహౌస్ కు వీరు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మేడారం జాతరకు కేసీఆర్ ను వీరు ఆహ్వానించనున్నారు. అధికారిక ఆహ్వాన పత్రికను అందించి మేడారం జాతరకు ఆహ్వానిస్తారు.
మరోవైపు, అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ జాతర జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది. 28న సారలమ్మ అమ్మవారు, 29న సమ్మక్క అమ్మవారు గద్దెకు విచ్చేస్తారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకుంటారు, 31న అమ్మవార్లు మళ్లీ వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. తెలంగాణ కుంభమేళాగా పిలవబడే ఈ పండుగకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు.
ఈ జాతరను ప్రజలందరి పండుగగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే సీతక్క, కొండా సురేఖ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆయనను ఆహ్వానించనున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవారి గద్దెలు, ప్రాంగణం పునరుద్ధరణ పనుల ప్రారంభోత్సవం జనవరి 19న జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు హాజరవుతారు.