టీమిండియాకు షాక్.. తిలక్ వర్మకు సర్జరీ

  • భారత యువ బ్యాటర్ తిలక్ వర్మకు రాజ్‌కోట్‌లో అత్యవసర సర్జరీ
  • న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరం కానున్న తిలక్
  • టీ20 ప్రపంచకప్ ఆడటంపై నెలకొన్న అనిశ్చితి
  • తిలక్ కోలుకోవడానికి నెల రోజులు పట్టొచ్చని వైద్య నిపుణుల అంచనా
  • తిలక్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు చోటు ద‌క్కే అవకాశం
టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మకు అత్యవసర శస్త్రచికిత్స జరిగింది. దీంతో అతను న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లోనూ అతను ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.

విజయ్ హజారే ట్రోఫీ కోసం రాజ్‌కోట్‌లో ఉన్న తిలక్ వర్మకు బుధవారం ఉదయం అల్పాహారం తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా, స్కానింగ్ అనంతరం వైద్యులు అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వైద్య బృందంతో సంప్రదింపులు జరిపిన అనంతరం సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ఇలాంటి సర్జరీల నుంచి అథ్లెట్లు పూర్తిగా కోలుకోవడానికి గరిష్ఠంగా నెల రోజులు పట్టవచ్చని ఓ క్రీడా వైద్య నిపుణుడు అభిప్రాయపడ్డారు. దీంతో టీ20 ప్రపంచకప్‌లో అతని ప్రాతినిధ్యంపై అనిశ్చితి ఏర్పడింది. టీ20 ఫార్మాట్‌లో భారత జట్టులో తిలక్ వర్మ కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పటివరకు 37 ఇన్నింగ్స్‌లలో 49.29 సగటుతో 1,183 పరుగులు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో సిరీస్ ప్రారంభం కానుండగా, తిలక్ వర్మ స్థానంలో బీసీసీఐ ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. అతని గైర్హాజరీలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.


More Telugu News