జంతుబలులు ఇచ్చి ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన వైసీపీ కార్యకర్తలతో జగన్ భేటీ
- జగన్ పుట్టినరోజు సందర్భంగా పలు చోట్ల పొట్టేళ్లను బలిచ్చిన వైసీపీ శ్రేణులు
- రప్పా రప్పా అంటూ నినాదాలు
- పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉంటాలన్న జగన్
గత నెల వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా గోపాలపురం నియోజకవర్గం తూర్పు చోడవరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు జగన్ ఫ్లెక్సీ ముందు పొట్టేలు బలి ఇచ్చారు. ఆ రక్తంతో ఫ్లెక్సీకి అభిషేకం చేసి, రప్పా రప్పా అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రజల్లో భయాందోళనలు రేగాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
నల్లజర్ల పోలీసులు ఏడుగురు కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. జంతు హింస చట్టం కింద, ప్రజల్లో భయం కలిగించినందుకు, బహిరంగ ప్రదేశంలో అలాంటి చర్యలు తీసుకున్నందుకు కేసు నమోదు చేశారు. వీరిని అరెస్ట్ చేసి రోడ్డు మీదుగా నడిపిస్తూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలపై 16 కేసులు, 63 మంది అరెస్టులు జరిగాయి.
పొట్టేలు బలి ఇచ్చిన వైసీపీ కార్యకర్తలతో తాజాగా జగన్ భేటీ అయ్యారు. గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ హోంమంత్రి తానేటి వనిత వారిని తీసుకొచ్చారు. కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపించిన తీరును వారు జగన్‌కు వివరించారు. ధైర్యంగా ఉండమని, భయపడవద్దని జగన్ వారికి చెప్పారు. కేసులపై పార్టీ న్యాయ విభాగం సహాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ దన్నుతో పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దిగజారుడుగా వ్యవహరిస్తున్నారని జగన్ ఈ సందర్భంగా ఆరోపించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ప్రకటన కూడా జారీ చేసింది.