ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం

  • ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితుడు శ్రవణ్‌కు హైకోర్టు బెయిల్
  • రూ.25 వేల పూచీకత్తుపై షరతులతో మంజూరు
  • నల్గొండ కోర్టు విధించిన జీవిత ఖైదును సవాల్ చేసిన నిందితుడు
  • వయసు, జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం
తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితుడు శ్రవణ్‌కుమార్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ. 25 వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు అదే మొత్తానికి రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. బెయిల్‌పై ఉన్న సమయంలో ఎలాంటి నేరాలకు పాల్పడరాదని స్పష్టం చేసింది.

2025 మార్చిలో నల్గొండ జిల్లా కోర్టు ఈ కేసులో శ్రవణ్‌కుమార్‌కు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించారు. తన అప్పీల్ విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ మంజూరు చేయాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం, నిందితుడి వయసు, జైలు జీవితాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్‌కు అనుమతించింది.

2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్‌ను ఆయన మామ మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో దారుణంగా హత్య చేయించారు. తన కుమార్తె అమృత, ప్రణయ్‌ను కులాంతర వివాహం చేసుకోవడమే ఇందుకు కారణం. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిపిన నల్గొండ కోర్టు, ప్రణయ్‌ను హత్య చేసిన సుభాశ్ శర్మకు (ఏ-2) ఉరిశిక్ష, రూ. 15వేల జ‌రిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, అమృత బాబాయి అయిన శ్రవణ్‌కుమార్‌తో పాటు మిగిలిన నిందితులకు జీవిత ఖైదు, రూ. 10వేల జ‌రిమానాను ఖ‌రారు. ఇప్పుడు శ్రవణ్‌కు బెయిల్ లభించడం చర్చనీయాంశంగా మారింది.


More Telugu News