Asaduddin Owaisi: మసీదు కూల్చివేతపై ఒవైసీ ఆగ్రహం
- శంభాజీనగర్‌లో వక్ఫ్ భూమిలో ఉన్న మసీదు కూల్చివేతపై ఒవైసీ ఆగ్రహం
- ఢిల్లీలోని మసీదు సమీపంలో కూల్చివేతలను కూడా తప్పుబట్టిన వైనం
- వక్ఫ్ గెజిట్ నోటిఫికేషన్ ను కోర్టుకు సమర్పించాలని వక్ఫ్ బోర్డుకు సూచన
మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో వక్ఫ్ భూమిలో ఉన్న మసీదు కూల్చివేతపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. అలాగే ఢిల్లీలోని తుర్క్‌మాన్ గేట్ దగ్గర ఫైజ్-ఎ-ఇలాహి మసీదు సమీపంలో జరిగిన కూల్చివేతలను కూడా ఆయన ఖండించారు. ఆ భూమి పూర్తిగా వక్ఫ్ బోర్డుదే అని స్పష్టం చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్న 'సేవ్ ఇండియా ఫౌండేషన్' పిటిషన్‌పై నవంబర్ 12న ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిందని, కానీ కోర్టు ఆదేశించిన సర్వేలో వక్ఫ్ బోర్డును ఒక పార్టీగా చేర్చకపోవడం ఆశ్చర్యకరమని ఒవైసీ అన్నారు. ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఈ కేసులో జోక్యం చేసుకుని, వక్ఫ్ గెజిట్ నోటిఫికేషన్‌ను కోర్టుకు సమర్పించాల్సిందని సూచించారు. రివ్యూ పిటిషన్ వేయకపోవడంతో కోర్టు తప్పుడు నిర్ణయం తీసుకుందని, దీంతో వక్ఫ్ ఆస్తికి నష్టం జరిగిందని విమర్శించారు. 1947లో అది మసీదుగా ఉండేదని గుర్తుచేసిన ఒవైసీ... వక్ఫ్ బోర్డు, మసీదు నిర్వహణ కమిటీ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, వాస్తవాలు వివరించి స్టేటస్ కో తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు. అంతేకాకుండా, ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు ఇన్ని రోజులైనా బెయిల్ ఇవ్వకపోవడంపై కూడా ఒవైసీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.