Chandrababu Naidu: తెలంగాణతో నీటి వివాదాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- సముద్రంలోకి పోతున్న నీటిని ఎవరైనా వాడుకోవచ్చన్న చంద్రబాబు
- కొందరు మాట్లాడుతున్న మాటలు తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్య
- రెండు రాష్ట్రాల మధ్య విరోధాలు పెంచొద్దని హితవు
- వైసీపీ అక్రమాలపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడి
- రాయలసీమ ఎత్తిపోతలపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపాటు
ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ తెలంగాణతో నీటి వివాదాలపై సున్నితంగా, స్పష్టంగా స్పందించారు.
గోదావరి నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, సముద్రంలోకి పోతున్న నీటిని ఎవరైనా వాడుకోవచ్చని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదని, నీటి విషయంలో రాజకీయాలు చేయొద్దని తెలంగాణను కోరారు. "తెలుగు జాతి ఒక్కటే... ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. రెండు రాష్ట్రాల మధ్య విరోధాలు పెంచుకుని ఇతరులు ఆనందించే పరిస్థితి రావొద్దు" అని హితవు పలికారు.
కొందరు మాట్లాడుతున్న మాటలు వింటుంటే... ఆ రాజకీయాలేమిటో తనకే అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. గోదావరి నది పైభాగంలో దేవాదుల ఉందని... దేవాదుల నుంచి నీళ్లు వస్తే కింద ఉన్న పోలవరానికే వస్తాయని, కిందికి వచ్చే నీళ్లకు అభ్యంతరం చెబితే అర్థమేమీ ఉండదని అన్నారు. తాము ఎప్పుడూ దేవాదులకు వ్యతిరేకం కాదని, తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు కూడా అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. నీళ్లు పొదుపు చేస్తే తెలంగాణకూ లాభమేనని, మిగులు నీటిని శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకోవచ్చని సూచించారు.
కృష్ణా నదిలో నీళ్లు తక్కువగా ఉండటంతో పైన ప్రాజెక్టులు కడితే నష్టమని, కానీ గోదావరి డెల్టాను కాపాడుకుని కృష్ణా-గోదావరి అనుసంధానం చేస్తే ఇబ్బంది ఉండదని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతలపై కొందరు చేస్తున్న వ్యాఖ్యల్లో అర్థం లేదని, అబద్ధాలను వందసార్లు చెబితే నిజమవుతుందని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
పోలవరం ఆలస్యంపై గత వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శించారు. గత ప్రభుత్వం వల్లే 6-7 ఏళ్లు ఆలస్యమైందని, డయాఫ్రం వాల్ పాడైందని ఐఐటీ హైదరాబాద్ నిపుణులు చెప్పిన తర్వాతే వాళ్లకు తెలిసిందని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా డయాఫ్రం వాల్ కడుతున్నామని, ఫిబ్రవరి 15లోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని, కానీ దర్యాప్తు పేరుతో కాలయాపన చేసుకుంటూ పోతే, పనులు పూర్తి చేయడానికి చాలా కాలం పడుతుందని చెప్పారు. అనుమతులు లేని ప్రాజెక్టులకు రూ. 2 వేల కోట్లు ఖర్చు పెట్టారని... ఎన్జీటీకి రూ. 100 కోట్ల జరిమానా కట్టారని దుయ్యబట్టారు.