Donald Trump: ఫ్రాన్స్ అధ్యక్షుడు తనను ప్రాధేయపడ్డారంటూ ట్రంప్ హేళన

Donald Trump Ridicules Macron Claiming French President Begged Him
  • "ప్లీజ్, డొనాల్డ్ ట్రంప్" అంటూ తనను బతిమాలాడాడన్న ట్రంప్
  • రిపబ్లికన్ చట్టసభ సభ్యుల సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యలు
  • ఔషధ ధరల పెంపు విషయంలో ప్రాధేయపడినట్లు వెల్లడి
ఒకానొక సందర్భంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ తనను ప్రాధేయపడ్డారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఔషధ ధరల పెంపు గురించి ప్రస్తావిస్తూ మేక్రాన్‌ను ఆయన హేళన చేశారు. "ప్లీజ్, డొనాల్డ్ ట్రంప్" అంటూ మేక్రాన్ తనను బతిమాలారని రిపబ్లికన్ చట్టసభ సభ్యుల సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. గతంలో ఇరువురి మధ్య జరిగిన సమావేశాన్ని ఆయన ప్రస్తావించారు.

ఫ్రాన్స్ ఔషధ ధరలను మూడింతలు పెంచాలని తాను మేక్రాన్‌ను కోరినట్టు, అయితే ఆయన తొలుత అందుకు అంగీకరించలేదని ట్రంప్ తెలిపారు. దాంతో ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతోన్న వస్తువులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించినట్లు ఆయన వెల్లడించారు. దీంతో మేక్రాన్ తన డిమాండ్లకు అంగీకరించవలసి వచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు.

టారిఫ్‌ల గురించి హెచ్చరించిన తర్వాత మేక్రాన్ తనను ప్రాధేయపడ్డారని ట్రంప్ అన్నారు. ఒక ఒప్పందం కుదిరిందని, ఔషధాల ధరలను తాను కోరుకున్నంత పెంచుతానని, కానీ ఈ విషయం తమ ప్రజలకు చెప్పవద్దని మేక్రాన్ బతిమాలినట్లు ట్రంప్ తెలిపారు. ఫలితంగా, 10 డాలర్లు ఉన్న ఒక మందు బిళ్లను ఫ్రాన్స్ 30 డాలర్లకు పెంచిందని ఆయన పేర్కొన్నారు.

ఫ్రాన్స్ ఔషధాల ధరలు తక్కువగా ఉండటంతో అమెరికాలో వాటి విక్రయం ఎక్కువగా జరిగేదని, దీనివల్ల అమెరికా కంపెనీలకు నష్టం వాటిల్లేదని తెలుస్తోంది. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఫ్రాన్స్ ధరలు పెంచడంతో అమెరికాలోని స్థానిక కంపెనీలకు డిమాండ్ పెరిగినట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలపై మేక్రాన్ లేదా ఫ్రాన్స్ ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.
Donald Trump
Emmanuel Macron
France
US Tariffs
Drug Prices
Pharmaceuticals
Trade War
International Relations
Republicans
America

More Telugu News