స‌చిన్ ఇంట పెళ్లి బాజాలు.. అర్జున్ టెండూల్క‌ర్ పెళ్లి డేట్ ఫిక్స్‌!

  • మార్చిలో జరగనున్న అర్జున్ టెండూల్కర్ వివాహం
  • వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో పెళ్లి
  • గతేడాది ఆగస్టులోనే అత్యంత రహస్యంగా నిశ్చితార్థం
  • కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ముంబైలో వేడుక
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు, వ్యాపారవేత్త అయిన సానియా చందోక్‌ను ఆయన వివాహం చేసుకోనున్నాడు. కొంతకాలంగా వీరి పెళ్లి గురించి ప్రచారం జరుగుతున్నప్పటికీ, తాజాగా వివాహ తేదీలు ఖరారైనట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో వీరి వివాహ వేడుక జరగనుంది.

తాజాగా వచ్చిన కథనాల ప్రకారం వీరి పెళ్లి వేడుకలు మార్చి 3న ప్రారంభమై, 5న ముంబైలో ప్రధాన కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు, కొద్దిమంది క్రికెటర్ల సమక్షంలో చాలా ప్రైవేట్‌గా నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. వాస్తవానికి అర్జున్, సానియా నిశ్చితార్థం గత ఏడాది ఆగస్టులోనే అత్యంత రహస్యంగా జరిగింది. అప్పట్లో ఈ విషయం బయటకు రాలేదు.

ఈ వార్తను స్వయంగా సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'రెడిట్'లో నిర్వహించిన 'ఆస్క్ మీ ఎనీథింగ్'  సెషన్‌లో ధ్రువీకరించారు. "అర్జున్‌కు నిశ్చితార్థం జరిగిందా?" అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సచిన్ స్పందిస్తూ, "అవును, జరిగింది. అతని జీవితంలో ఈ స‌రికొత్త ప్ర‌యాణం కోసం మేమంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం" అని బదులిచ్చారు. ఇక వధువు సానియా చందోక్ విషయానికొస్తే, ఆమె ఒక వ్యాపారవేత్త. ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు. కొంతకాలంగా ఆమె టెండూల్కర్ కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటున్నారు.

అర్జున్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్
మరోవైపు అర్జున్ టెండూల్కర్ తన క్రికెట్ కెరీర్‌పై దృష్టి సారించాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గోవా జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. 2022లో గోవా తరఫున తన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి, తన తండ్రి ఫీట్‌ను పునరావృతం చేశాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన అర్జున్, ఇటీవలే జరిగిన ట్రేడింగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) జట్టుకు మారాడు. వ్యక్తిగత జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న అర్జున్, రాబోయే ఐపీఎల్ సీజన్‌లో ఎలా రాణిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


More Telugu News