Sivakarthikeyan: ఓటీటీలోకి ఏలియన్ కామెడీ చిత్రం... ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Sivakarthikeyans Ayalaan Alien Comedy Movie Streaming on Aha
  • తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ చేసిన ప్రయోగాత్మక ఏలియన్ కామెడీ మూవీ ‘అయలాన్’ 
  • గత నెల డిసెంబరులో తెలుగు వెర్షన్‌ జీ తెలుగులో ప్రసారంతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు
  • అయలాన్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ జనవరి 7 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటూ అధికారిక ప్రకటన
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ అభిమానులకు ఇది శుభవార్త. ఆయన నటించిన ప్రయోగాత్మక ఏలియన్ కామెడీ చిత్రం ‘అయలాన్’ తెలుగులో ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. ఇప్పటివరకు థియేటర్లలోనూ, ఓటీటీలోనూ తెలుగు వెర్షన్ విడుదల కాకపోవడంతో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది నిజంగా శుభవార్తే.

శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అయలాన్’ చిత్రం 2024 సంక్రాంతికి తమిళంలో విడుదలైంది. అప్పట్లోనే తెలుగు వెర్షన్‌ను కూడా థియేటర్లలో విడుదల చేయాలని యోచించారు. జనవరి 26న తెలుగు విడుదల ఉంటుందని ప్రకటించడంతో పాటు, హైదరాబాద్‌లో శివకార్తికేయన్ ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. కానీ అనివార్య కారణాల వల్ల బిగ్ స్క్రీన్ విడుదల నిలిచిపోయింది. అనంతరం తమిళ వెర్షన్‌ను సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు. అయితే తెలుగు డబ్బింగ్‌పై అప్పట్లో ఎలాంటి సమాచారం వెలువడలేదు.

ఈ నేపథ్యంలో గత నెల డిసెంబరులో తెలుగు వెర్షన్‌ను జీ తెలుగులో ప్రసారం చేయడం ద్వారా తొలిసారిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తాజాగా ఓటీటీ విషయంలోనూ స్పష్టత వచ్చింది. అయలాన్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ జనవరి 7 నుంచి ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కథ విషయానికి వస్తే.. ఒక ప్రత్యేక మిషన్‌లో భాగంగా భూమ్మీదకు వచ్చిన ఒక గ్రహాంతరవాసి అనుకోకుండా హీరోను కలుస్తుంది. కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ ఏలియన్‌కు హీరో ‘టాటూ’ అని పేరు పెడతాడు. అయితే కొన్ని పరిణామాల కారణంగా టాటూ దుష్టుల చేతుల్లో చిక్కుకుంటుంది. దానిని కాపాడేందుకు హీరో చేసే ప్రయత్నాలే మిగతా కథ. ఏలియన్ భూమ్మీదకు రావడానికి కారణమేమిటి? హీరో దానిని ఎలా కాపాడాడు? అన్నదే ముగింపు. ఏలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ వాయిస్ ఓవర్ అందించారు. 
Sivakarthikeyan
Ayalaan
Ayalaan Telugu movie
Rakul Preet Singh
Aha OTT
alien comedy movie
Telugu dubbing
Siddharth voice over
Tamil movie
OTT release

More Telugu News