Tata Power: ఏపీలో టాటా పవర్ భారీ పెట్టుబడి.. రూ. 6,675 కోట్లతో నెల్లూరులో సోలార్ యూనిట్

Tata Power to Establish Rs 6675 Crore 10 GW Ingot and Wafer Manufacturing Facility in Nellore
  • 10 గిగావాట్ల ఇంగాట్, వేఫర్ తయారీ కేంద్రం ఏర్పాటు
  • సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర పెట్టుబడుల మండలి ఆమోదం
  • ప్రత్యక్షంగా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు
  • ఇది ఏపీపై విశ్వాసానికి నిదర్శనమన్న మంత్రి నారా లోకేశ్‌
ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి తరలివచ్చింది. ప్రముఖ టాటా గ్రూప్‌కు చెందిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL), రాష్ట్రంలో భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. నెల్లూరులో రూ. 6,675 కోట్ల పెట్టుబడితో 10 గిగావాట్ల సామర్థ్యం గల ఇంగాట్, వేఫర్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. దేశంలోనే ఇది అతిపెద్ద ఇంగాట్, వేఫర్ తయారీ కేంద్రం కానుండటం విశేషం.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో ఈ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాల భూమిని కేటాయించింది. తొలిదశలో 120 ఎకరాలు, భవిష్యత్ విస్తరణ కోసం మరో 80 ఎకరాలు ఉపయోగించనున్నారు.

సోలార్ సెల్స్, మాడ్యూల్స్, సెమీకండక్టర్ల తయారీలో ఇంగాట్లు, వేఫర్లు అత్యంత కీలకమైనవి. ఈ ప్రాజెక్టు ద్వారా దేశీయంగా వీటి ఉత్పత్తి పెరిగి, దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా సుమారు 1,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఫ్యాక్టరీకి అవసరమైన విద్యుత్‌ను అందించేందుకు 200 మెగావాట్ల గ్రీన్ పవర్ ప్లాంట్‌ను కూడా టీపీఆర్ఈఎల్‌ ఏర్పాటు చేయనుంది.

ఈ భారీ పెట్టుబడిపై రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. "ఆంధ్రప్రదేశ్‌లో టాటా గ్రూప్ మరో చారిత్రక పెట్టుబడి పెట్టడం గర్వంగా ఉంది. మా ప్రభుత్వ పాలనా స్థిరత్వం, మౌలిక వసతులు, స్వచ్ఛ ఇంధన తయారీకి ఇస్తున్న ప్రాధాన్యతపై ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనం. ఈ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన ఉద్యోగాలు లభిస్తాయి" అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో సిద్ధంగా ఉన్న పారిశ్రామిక భూములు, బలమైన మౌలిక వసతులు, పోర్టు కనెక్టివిటీ వంటి అంశాలు ఈ పెట్టుబడిని ఆకర్షించడంలో కీలకపాత్ర పోషించాయి. ఈ ప్రాజెక్టుతో నెల్లూరు ప్రాంతం సోలార్ తయారీ హబ్‌గా మరింత అభివృద్ధి చెందనుంది.
Tata Power
Andhra Pradesh
Nellore
Solar Power
Renewable Energy
Ingot Manufacturing
Wafer Manufacturing
Nara Lokesh
Green Power Plant
AP Investment

More Telugu News