Chandrababu: నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu to Visit Polavaram Project Today
  • క్షేత్రస్థాయిలో పనుల పురోగతి స్వయంగా పరిశీలన
  • 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యం
  • అధికారులతో సమీక్ష అనంతరం సీఎం మీడియా సమావేశం
  • సమీక్ష తర్వాత రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి పయనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించి, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని స్వయంగా పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు.

పర్యటనలో భాగంగా ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌లోని గ్యాప్ 1, గ్యాప్ 2 నిర్మాణాలు, బట్రస్ డ్యామ్, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ వంటి పనులను ఆయన తనిఖీ చేస్తారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ప్రాజెక్టు పనులు, కుడి, ఎడమ కాలువల అనుసంధానం వంటి అంశాలపై చర్చించి, తదుపరి లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాజెక్టు సివిల్ పనులు 88 శాతం మేర పూర్తయ్యాయి. అధికారులతో సమీక్ష అనంతరం సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో పర్యటన వివరాలను వెల్లడించనున్నారు. ఈ పర్యటన ముగించుకుని, ఆయన రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి వెళ‌తారు.
Chandrababu
Polavaram Project
Andhra Pradesh
AP CM
Polavaram Project Visit
Irrigation Project
Polavaram Construction
AP Politics
Jalav ресурs Department

More Telugu News