Nara Lokesh: సోషల్ మీడియాలో రెచ్చిపోతే ఇక కఠిన చర్యలే: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Warns Strict Action Against Social Media Hate Speech
  • సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు
  • సద్విమర్శలను స్వాగతిస్తాం, కుట్రపూరిత పోస్టులను సహించబోమన్న లోకేశ్
  • మహిళలపై అసభ్య పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక నిఘా
  • ఇతర దేశాల చట్టాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచన
సోషల్ మీడియా వేదికగా కుట్రపూరితంగా విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపుతామని, అటువంటి వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాలపై వచ్చే సద్విమర్శలను మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని, అయితే వాక్ స్వాతంత్ర్యం (ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్) పేరుతో వ్యవస్థీకృతంగా చేసే దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో 'సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణ' అనే అంశంపై ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశంలో మంత్రి లోకేశ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... “వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, మహిళలను కించపరిచేలా అసభ్యకర పోస్టులు పెట్టడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డీప్ ఫేక్ కంటెంట్‌ను అరికట్టాలి. మహిళలపై అవమానకరమైన పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. ప్రజాభిప్రాయాన్ని అడ్డుకోవడం మా ఉద్దేశం కాదు. కానీ, కొందరు విదేశాల్లో ఉంటూ ఇక్కడి సామాజిక సామరస్యానికి భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారు. వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు వీలుగా బలమైన చట్టపరమైన వ్యవస్థను (లీగల్ ఫ్రేమ్‌వర్క్) రూపొందించాలి” అని అధికారులను ఆదేశించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి భార్యపై అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తి తమ పార్టీకి చెందిన వాడైనా జైలుకు పంపించామని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తుచేశారు.

సోషల్ మీడియా నియంత్రణ కోసం ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలవుతున్న చట్టాలను అధ్యయనం చేయాలని లోకేశ్ సూచించారు. ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్, యూకే వంటి దేశాల్లో స్వతంత్ర నియంత్రణ సంస్థలు పనిచేస్తూ భారీ జరిమానాలు విధిస్తున్నాయని ఆయన ప్రస్తావించారు. గతంలో న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని కూడా అసభ్య పోస్టులు పెట్టారని, ఇలాంటి ధోరణులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

ఈ సమావేశంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. సైబర్ నేరాలకు సంబంధించి కేసుల నమోదు, చార్జిషీటు దాఖలులో జాప్యం జరుగుతోందని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నెల రోజుల్లోగా చార్జిషీటు దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని, విద్వేషపూరిత పోస్టులు పెట్టే వారి సోషల్ మీడియా ఖాతాలను తక్షణమే సస్పెండ్ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని పటిష్టమైన చట్టాన్ని రూపొందిస్తామని, రాష్ట్రస్థాయిలో సమన్వయ సెల్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధితో పాటు హోం, న్యాయ, ఐటీ, సమాచార శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Nara Lokesh
Andhra Pradesh
social media
cyber crime
fake news
hate speech
Vangalapudi Anitha
cyber security
Kolusu Parthasarathy
legal framework

More Telugu News