TTD: శ్రీవాణి టికెట్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం... జనవరి 9 నుంచి కొత్త విధానం

TTD Announces Key Decision on Srivani Tickets New System from January 9
  • రోజూవారీ కరెంట్ బుకింగ్ కింద ఆన్‌లైన్‌లో టికెట్ల కేటాయింపు
  • అడ్వాన్స్ బుకింగ్, ఎయిర్‌పోర్ట్ కౌంటర్ విధానం యథాతథం
  • నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా కొత్త విధానం అమలు
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో ముఖ్యమైన మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తుల సౌలభ్యం, క్యూలైన్ల నివారణ లక్ష్యంగా ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న శ్రీవాణి టికెట్లను జనవరి 9వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వీటికి బదులుగా ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది.

ఈ కొత్త విధానం కింద, తిరుమలలో ఆఫ్‌లైన్‌లో ఇచ్చే 800 శ్రీవాణి టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనం కోసం తిరుమలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్, మొబైల్ నంబర్ ధృవీకరణ తప్పనిసరి చేశారు. ఒక కుటుంబం నుంచి గరిష్ఠంగా నలుగురికి (1+3) మాత్రమే బుకింగ్ అవకాశం కల్పించారు.

ఈ నూతన విధానాన్ని నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆ తర్వాత సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు. ఆఫ్‌లైన్ టికెట్ల కోసం భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఈ మార్పు చేశామని పేర్కొన్నారు.

అయితే, ఇప్పటికే ఆన్‌లైన్‌లో మూడు నెలల ముందుగా జారీ చేస్తున్న 500 శ్రీవాణి అడ్వాన్స్ బుకింగ్ టికెట్ల విధానం, అలాగే తిరుపతి విమానాశ్రయంలో ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్న 200 టికెట్ల విధానం యథావిధిగా కొనసాగుతాయని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఈ మార్పులను గమనించి, తమ దర్శన ప్రణాళికలను రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేసింది.
TTD
Srivani tickets
Tirumala
Tirupati
Online booking
Darshan
Pilgrims
Andhra Pradesh

More Telugu News