Satish: భూమి తమకే దక్కాలంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద నగ్నంగా నిరసన

Satish Protests Naked at Tahsildar Office Over Land Dispute
  • వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో ఘటన
  • తండ్రికి చెందిన భూమి తమకే రావాలన్న రెండో భార్య కుమారుడు
  • తనకు కూడా రావాలంటూ మూడవ భార్య కూతురు దరఖాస్తు
  • అధికారులు జాప్యం చేస్తున్నారంటూ రెండో భార్య కుమారుడి ఆందోళన
వికారాబాద్ జిల్లా, చౌడాపూర్ మండల కేంద్రంలో ఒక వ్యక్తి తమ తండ్రి భూమి తమకే దక్కాలని, కానీ తమ పేరు మీద విరాసత్ (వారసత్వ హక్కు) చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ తహసీల్దారు కార్యాలయం ఎదుట నగ్న ప్రదర్శనకు దిగాడు. చౌడాపూర్ మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన హన్మయ్య అనే రైతుకు 7.29 ఎకరాల భూమి ఉంది. అతను మూడు సంవత్సరాల క్రితం మరణించాడు.

హన్మయ్యకు మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో ఆమె సోదరి ఈశ్వరమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు సంతానం ఉన్నారు. భూమిని తమకు విరాసత్ చేయాలని కోరుతూ మొదటి భార్య గత నెలలో చౌడాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకుంది. అయితే, సరైన పత్రాలు లేవని అధికారులు తిరస్కరించారు.

హన్మయ్యకు తాను మూడో భార్య కుమార్తెనని పేర్కొంటూ కావలి యాదమ్మ అనే మహిళ కూడా రెవెన్యూ అధికారులను సంప్రదించింది. ఆ భూమి తనకు చెందాలని ఆమె దరఖాస్తు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు క్లెయిమ్ చేయడంతో అధికారులు ఎవరికీ విరాసత్ చేయలేదు.

దీంతో అధికారులు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ, రెండవ భార్య కుమారుడు సతీశ్ రెవెన్యూ కార్యాలయానికి వచ్చి నగ్నంగా నిరసన వ్యక్తం చేశాడు. తహసీల్దారు అతనితో మాట్లాడి, విచారణ జరిపి చట్ట ప్రకారం ఎవరు వారసులో వారికి భూమి చెందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో సతీష్ ఆందోళన విరమించాడు.
Satish
Vikarabad
Choudapur
Tahsil Office
Land Dispute
Naked Protest
Inheritance
Revenue Department

More Telugu News