NTR: ఎన్టీఆర్ ఇల్లు ఒక దేవాలయం... నేనక్కడ ఒక పూజారిని మాత్రమే!
- చెన్నై టీ నగర్, బజుల్లా రోడ్డులోని ఎన్టీఆర్ ఇల్లు
- 1953లో ఇంటిని కొనుగోలు చేసిన ఎన్టీఆర్
- పలు హిట్లు, సూపర్ హిట్లు చూసిన ఇల్లు
- ఆ ఇంటిని కొనుగోలు చేసిన చదలవాడ శ్రీనివాసరావు
- బర్మా టేక్ ఉడ్ తో నవీకరణ చేయిస్తున్న చదలవాడ
- ఎప్పుడైనా ప్రజలు ఇంటిని సందర్శించవచ్చని వెల్లడి
ఆ ఇంటికి ఒక ఘనమైన .. మహోన్నతమైన చరిత్ర ఉంది!
ఆ ఇంటికి, తెలుగువారికి విడదీయరాని సంబంధం ఉంది!
అది మామూలు ఇల్లు కాదు..
ఒక రాముడు.. ఒక కృష్ణుడు వెలసిన ఒక అందమైన కోవెల!
తెలుగు వారి గుండెల్లో కొలువైన ఒక దైవం మూడు దశాబ్దాల పాటు నివసించిన ఇల్లది!
తండోప తండాలుగా బస్సుల్లో తిరుమలకు వచ్చి దేవదేవుడిని దర్శనం చేసుకుని.. అటు నుంచి మద్రాసు వచ్చి ఈ ఇంటి దేవుడ్ని కూడా కనులారా వీక్షించి.. తమ జన్మ ధన్యమైందన్నట్టు పరమానందభరితులై.. ఆ ఇంటి గేటుని కళ్లకద్దుకుని.. తరించిన తెలుగువారు ఎందరో!
అవును.. అప్పటి మద్రాసు ఇప్పటి చెన్నైలోని టి.నగర్, బజుల్లా రోడ్డులోని ఆ ఇంటికి అంతటి ఘన చరిత్ర ఉంది!
పురాణ పురుషులు రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారన్నది ఆయా పాత్రల పోషణ ద్వారా చూపించి, అశేష ప్రేక్షకుల మనఃఫలకంపై చెరగని ముద్రను వేసిన విశ్వవిఖ్యాత నట సార్వ భౌముడు... తెలుగువారి ఆరాధ్యనటుడు, నటరత్న నందమూరి తారకరామారావు మూడు దశాబ్దాల పాటు నివసించిన ఇల్లది!
వెయ్యి గజాల విస్తీర్ణంలో నిర్మితమైన ఆ ఇంటిని 1953లో ఎన్టీఆర్ కొనుగోలు చేశారు.
ఆ ఇంటిని ప్రముఖ నటుడు కస్తూరి శివరావు నుంచి ఎన్టీఆర్ కొన్నారని చాలా మంది అనుకుంటారు. అయితే, అది బెంగాల్ కు చెందిన వారి నుంచి కొనడం జరిగింది. ఆ ఇంటి పక్క ఇల్లు కస్తూరి శివరావు గారిది!
ఇక ఎన్టీఆర్ ఇల్లు ఎదురుగా వున్నది దర్శకరత్న దాసరి నారాయణరావు గారి ఇల్లు.
ఆ వీధిలోని ఏ ఇంటికీ అసలు వాచ్ మన్ అక్కర్లేదంటూ అప్పట్లో ఓ జోక్ ప్రచారంలో వుండేది..
ఎందుకంటే, దాసరి తన స్టోరీ డిస్కషన్స్ .. సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ .. వంటివన్నీ తెముల్చుకుని బెడ్ రూంలో లైటు తీసేసి నిద్రకు ఉపక్రమించే సరికి తెల్లవారుజామున మూడు గంటలు అయ్యేది..
సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వున్న ఇంటిలో ఎన్టీఆర్ నిద్ర నుంచి మేల్కొనే సమయం కావడంతో ఆయన గదిలో లైటు వెలిగేది!
దాంతో ఆ వీధి రాత్రల్లా కళకళలాడుతూనే ఉండేదన్న మాట.. అందుకే ఆ జోక్ ప్రచారంలోకి వచ్చింది.
ఇక తెల్లవారిందనగానే ఎన్టీఆర్ ఇంటికి ఏపీ నుంచి పలు బస్సులు వచ్చేవి..
తమ అభిమాన నటుడుని ఎప్పుడు చూద్దామా అన్న ఆత్రుత.. ఆనందంతో గలగలా జనం బస్సుల్లోంచి దిగి ఆ ఇంటి ముందు నిలబడేవారు.
ఇన్నాళ్లూ వెండితెరపై చూసిన ఎన్టీఆర్ సుందర రూపం తమ కళ్లముందు నిజంగానే ప్రత్యక్షం కాగానే ఆ జనం తన్మయత్వం చెందుతూ కేరింతలు కొట్టేవారు... ఎన్టీఆర్ కు జేజేలు పలికేవారు..
ఎన్టీఆర్ వారందరితోనూ ఆత్మీయ బంధువుగా మాట్లాడుతూ కుశల ప్రశ్నలు వేసి.. ఆతిథ్యమిచ్చి ఆదరించేవారు.
తెనాలి నుంచి 20, 15 ఏళ్లున్న ఇద్దరు అన్నదమ్ములు కూడా అలా తిరుపతికి, మద్రాసు ఎన్టీఆర్ ఇంటికి అప్పట్లో బస్సులు నడిపేవారు.
తెనాలి నుంచి తిరుపతికి అయితే 100 రూపాయలు, మద్రాసుకు అయితే 150 రూపాయలు టికెట్ పెట్టేవారు.
విచిత్రంగా తిరుపతి టికెట్ల కంటే ఎన్టీఆర్ ఇంటికే ఎక్కువ టికెట్లు బుక్కయ్యేవట!
అలా బస్సులు నడిపిన ఆ అన్నదమ్ములు ఎవరో కాదు..
వారే నేటి ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నిర్మాతలు అయిన చదలవాడ తిరుపతిరావు, చదలవాడ శ్రీనివాసరావు ద్వయం!
- - - - - - - - - - -
ఆమధ్య నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తమ 'రికార్డ్ బ్రేక్' సినిమా పనుల విషయమై మరో నిర్మాత, నందమూరి కుటుంబ సన్నిహితుడు అయిన ప్రసన్న కుమార్ ని తీసుకుని చెన్నై వెళ్లారు. ఓ రోజు డిన్నర్ కి వెళుతుంటే బజుల్లా రోడ్ కి రాగానే శ్రీనివాసరావుకి ఒక్కసారి ఎన్టీఆర్ ఇల్లు గుర్తొచ్చి వెంటనే చూడాలనిపించింది.
ఇద్దరూ కలిసి ఆ ఇంటికి వెళ్లారు..
ఆ ఇల్లు చూడగానే ఒక్కసారిగా తన దైవం ఎన్టీఆర్.. అప్పట్లో తాము బస్సుల్లో జనాన్ని తీసుకురావడం.. వారందరితోనూ ఎన్టీఆర్ నవ్వుతూ ముచ్చటించడం.. ఇవన్నీ శ్రీనివాసరావుగారి కళ్లముందు కదలాడాయి.
కొన్ని క్షణాలపాటు ఆ ఇంటిని అలాగే చూస్తూ వుండిపోయారాయన...
అప్పుడే ఆయనకొక ఆలోచన వచ్చింది..
ఈ ఇంటిని తీసుకోవాలన్న కోరిక పుట్టింది..
అదే విషయాన్ని పక్కనున్న తన సన్నిహితుడు, మిత్రుడు, రైట్ హ్యాండ్ అయిన ప్రసన్న కుమార్ కి చెప్పారు.
ఆయనొక్క క్షణం ఆలోచించి.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి చెబుతానన్నారు..
ఆ ఇంటిని తమ ఇల్లులా చూసుకునే ఒక మంచి వ్యక్తికి ఇవ్వాలని అప్పటికే నందమూరి కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. అందుకే చాలామంది అడిగినా అప్పటివరకు వారు ఎవరికీ ఇవ్వలేదు.
ఇది జరిగిన నెల రోజులకి శ్రీనివాసరావుకి ప్రసన్న కుమార్ శుభవార్త చెప్పారు.. ఇంటిని మీకివ్వడానికి వారసులు ఒప్పుకున్నారంటూ!
ఆ వార్త వినగానే తన జన్మ ధన్యమైందన్న అనుభూతి ఆయనకు కలిగింది.
ఆ ఇల్లు రామారావుగారు తన అర్ధాంగి బసవతారకం గారి పేరు మీద తీసుకున్నారు.. జూనియర్ ఎన్టీఆర్ సహా సుమారు 30 మంది వరకు వారసులు వున్నారు.
ఆ ఇంటికి ఇంత ఇమ్మని కూడా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అడగలేదు.. వారు అడిగిందల్లా ఒక్కటే, ఆ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలని!
ఆ ఏరియాలో వున్న విలువ ఆధారంగా శ్రీనివాసరావుగారే ఒక రేటు ఫిక్స్ చేయగా.. ఆ ఇంటికి జీపీఏ హోల్దర్లయిన మోహనకృష్ణ, రామకృష్ణ గార్లు రిజిస్టర్ చేసేశారు.
ఇక్కడ విశేషం ఏమిటంటే, ఎన్టీఆర్ సినిమాలలోకి రావడానికి ముందు సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన విషయం మనకు తెలిసిందే. ఆయన సబ్ రిజిస్ట్రార్ ట్రైనింగ్ కోసం అప్పట్లో మద్రాసు వచ్చారట (అప్పుడు ఆంధ్రా ప్రాంతమంతా మద్రాస్ స్టేట్ కదా). ఇప్పుడీ ఇంటిని రిజిస్టర్ చేసిన చెన్నైలోని సబ్ రిజిస్ట్రార్లు ఈ విషయం తెలుసుకుని 'ఆ మహనీయుడి ఇంటిని రిజిస్టర్ చేయడం మా అదృష్టం' అంటూ మహదానందపడిపోయారట.
"మా దైవం ఎన్టీఆర్ గారు దశాబ్దాల పాటు నివసించిన ఇల్లు మాకు దక్కడం మా పూర్వ జన్మ సుకృతం. అటువంటి మహనీయుని ఇల్లు మా సొంతమైందంటే దానికి ముఖ్య కారకుడు నా మిత్రుడు ప్రసన్న కుమార్. అలాగే మాకు ఇవ్వడానికి వెంటనే అంగీకరించిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే!" అన్నారు చదలవాడ శ్రీనివాసరావు.
ఆ ఇంట్లోనే రామారావుగారి పిల్లలంతా పుట్టారు. ఆ ఇంట్లో ఉండగానే ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడు, భీష్ముడు వంటి పురాణ పాత్రలు వేయడం, అజరామరమైన పౌరాణిక, సాంఘిక, జానపద కథా చిత్రాలు చేయడం జరిగింది. అలా ఆ ఇల్లు ఎన్నో హిట్లు, సూపర్ హిట్లూ చూసింది!
"ఎన్టీఆర్ గారికి బర్మా టేక్ అంటే ఎంతో ఇష్టం.. అందుకే ఇంటిలో రామారావు గారికి ఇష్టమైన ఫర్నిచర్ ని ఇప్పుడు బర్మా టేక్ తో చేయిస్తున్నాను. రామారావు గారు ఈ ఇంటిలో ఎక్కడ ఏ కుర్చీలో కూర్చునేవారో.. ఎక్కడ డైనింగ్ చేసేవారో వాటన్నిటినీ కొత్తగా చేయించి అవే ప్రదేశాలలో ఉంచుతాను. పాత ఉడ్ స్థానంలో కొత్త ఉడ్ వస్తుంది. ఇంట్లో మార్పులేమీ వుండవు.. అప్పటి రామారావు గారి ఇల్లులానే వుంటుంది.. అయితే, వస్తువులన్నీ కొత్తగా వుంటాయి. గేట్ కూడా బర్మా టేక్ తో చేయిస్తున్నాను.. ఆ గేట్ పై ఎన్టీఆర్ కృష్ణుడు, రాముడు రూపాలను చెక్కిస్తాం.. చాలా ప్లాన్ చేస్తున్నాం.. త్వరలో పూర్తవుతాయి.. మీరే చూద్దురుగాని!" అన్నారు శ్రీనివాసరావు.
ప్రస్తుతం ఇంటి నవీకరణ పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. బర్మా టేక్ సహా కలప అంతా హైదరాబాదు నుంచే శ్రీనివాసరావు టింబర్ ఎస్టేట్ నుంచే వెళుతోంది.
అన్నట్టు, చదలవాడ తిరుపతిరావు, శ్రీనివాసరావు సోదరులు చిన్నప్పటి నుంచీ ఎన్టీఆర్ కి వీరాభిమానులు. తిరుపతిరావు గారైతే ఇప్పటికీ రాత్రి భోజనం చేశాక ఎన్టీఆర్ పాత సినిమా ఒకటి చూస్తేనే కానీ తృప్తిగా నిద్రపోరు!
మరి గతంలో ఎన్టీఆర్ ని చూడడానికి.. ఆయన ఇల్లు చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు.. ఇప్పటికీ చాలామంది ఆ పాత ఇంటిని చూసి.. రామారావుగారి అందమైన రూపాన్ని తలచుకుని రెండుచేతులూ జోడించి నమస్కారం పెట్టి వెళ్లేవారు ఎందరో!
మరి.. ఇకముందు కూడా ఆ ఇంటిని ప్రజలు సందర్శించడానికి అవకాశం ఉంటుందా?
ఇదే అడిగితే శ్రీనివాసరావు చిర్నవ్వు నవ్వుతూ.. "అయ్యో.. తప్పకుండానండీ.. ఆ ఇంటిని ప్రజలకు అందుబాటులో వుంచాలన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను.. ఎవరైనా ఇక్కడికి రావచ్చు.. ఇంట్లోకి వచ్చి చూడచ్చు.. ఎటువంటి అభ్యంతరం కానీ, ఆంక్షలు కానీ వుండవు.. ఇది ఒక పవిత్రమైన ప్రదేశం.. ఇది ఒక దేవాలయం.. ఎన్టీఆర్ ఒక దేవుడు .. నేను కేవలం పూజారిని మాత్రమే!" అంటూ రెండు చేతులతో నమస్కరించారు.
అన్నట్టు ఆ ఇంటి హాలులో రామారావు గారి బంగారు విగ్రహం ప్రతిష్ఠించాలన్నది ఆయన ఆలోచన!
ఏమైనా, మొత్తానికి ఒక మహోన్నతమైన కళాకారుడి ఇల్లు ఒక కళాత్మక హృదయం వున్న శ్రీమంతుడైన అభిమాని చేతిలో పడడం గొప్ప విషయం!
ఇందుకు ఎన్టీఆర్ కుటుంబీకులు, సంధానకర్తగా వ్యవహరించిన ప్రసన్నకుమార్, అంతటి ఇంటిని సొంతం చేసుకున్న శ్రీనివాసరావు అభినందనీయులు!
-మోహన్ గోటేటి