Revanth Reddy: రేవంత్ రెడ్డిని భార్య గీతమ్మ కట్టేయాలి: కేటీఆర్

KTR Criticizes Revanth Reddys Behavior and Governance
  • రేవంత్‌కు కనీస భౌగోళిక జ్ఞానం కూడా లేదని ఎద్దేవా
  • సీనియర్లను తొక్కేసి సీఎం అయ్యాడని విమర్శ
  • బీఆర్ఎస్ కు కడియం శ్రీహరి ద్రోహం చేశారన్న కేటీఆర్

వరంగల్ జిల్లా జనగామలో సర్పంచ్ ల సన్మాన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరిపై విమర్శలు గుప్పించారు. 


కాంగ్రెస్‌లో సీనియర్లను తొక్కేసి అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన రేవంత్... అసెంబ్లీలో, బయటా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ తన గన్‌మెన్‌పై కూడా చేయి చేసుకునే స్థాయికి దిగజారారని, ఆయన పరిస్థితి పిచ్చి పట్టినట్లు ఉందని సెటైర్లు వేశారు. రేవంత్ భార్య గీతమ్మ ఆయన్ను కట్టేయాలి, లేకపోతే ఎవరినైనా కరిచే ప్రమాదం ఉందని అన్నారు.


సీఎం రేవంత్‌కు కనీస భౌగోళిక జ్ఞానం కూడా లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరిపై ఉందో, కృష్ణా నదిపై ఉందో...  బాక్రానంగల్ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సిగ్గులేని మాటలు, రోత చేతలు తప్ప రాష్ట్రానికి ఏమీ చేయలేదని దుయ్యబట్టారు.


కేసీఆర్‌ను "ఉరి తీయాలి" అని అన్న రేవంత్ మాటలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. "చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్‌ను ఉరి తీస్తావా?" అని ప్రశ్నించారు. 70 లక్షల రైతులను మోసం చేసిన రాహుల్ గాంధీని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీని "లీడర్" కాదు, కేవలం "రీడర్" అని ఎద్దేవా చేశారు. ఇక్కడి నాయకులు ఏమి రాస్తే అది చదవడమే ఆయన పని అని విమర్శించారు.


తాను చదువుకున్న వ్యక్తినని, రేవంత్ చెత్త తిరుగుడు తిరిగినవాడని ఎద్దేవా చేశారు. రేవంత్ మనవడు కూడా ఆయన్ను దేకడని శాపనార్థాలు పెట్టారు. కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ సరిపోడని, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి లాంటివాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడి కాలగర్భంలో కలిసిపోయారని, రేవంత్ పరిస్థితి కూడా అంతేనని హెచ్చరించారు.


అసెంబ్లీ ఇప్పుడు గౌరవ సభలా లేదు, కౌరవ సభలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే ముఖ్యమంత్రికి భయం పట్టుకుందని, అందుకే ఇలాంటి అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఘాటుగా మాట్లాడారు.


కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి కీలక పాత్ర లేకపోయినా, ఆయనను డిప్యూటీ సీఎం చేశామని చెప్పారు. అయినా ఆయన పార్టీకి ద్రోహం చేసి, కూతురు కోసం రేవంత్ వైపు వెళ్లారని మండిపడ్డారు. 


Revanth Reddy
KTR
BRS
Telangana
Kadiyam Srihari
Rahul Gandhi
KC Rao
Warangal
Telangana Politics

More Telugu News