టీ20 ప్రపంచ కప్ జట్టు బాగుంది.. గిల్ లేకపోవడం బాధ కలిగించింది: హర్భజన్ సింగ్

  • శుభ్‌మన్‌కు వన్డే జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించడాన్ని సమర్థించిన హర్భజన్
  • సవాళ్లను స్వీకరించడానికి అతడు సిద్ధంగా ఉన్నాడని వ్యాఖ్య
  • టీ20ల్లో గిల్ పునరాగమనంపై ఏమాత్రం సందేహం లేదన్న హర్భజన్
టీ20 ప్రపంచ కప్-2026 కోసం ఎంపిక చేసిన భారత జట్టు కూర్పు బాగుందని, అయితే జట్టులో శుభ్‌మన్ గిల్ లేకపోవడం కాస్త బాధ కలిగించిందని టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. శుభ్‌మన్‌కు వన్డే జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించడాన్ని హర్భజన్ సమర్థించాడు. సవాళ్లను స్వీకరించడానికి అతడు సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నాడు. ఈ మేరకు ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ మాట్లాడాడు.

జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌తో శుభ్‌మన్ గిల్ పునరాగమనం చేయబోతున్నాడు. అయితే ఇటీవల ప్రకటించిన టీ20 ప్రపంచ కప్ 2026 జట్టులో మాత్రం అతనికి స్థానం దక్కలేదు. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ స్పందించాడు.

గిల్ పునరాగమనంపై తనకు ఏమాత్రం సందేహం లేదని అన్నాడు. టీమిండియా కోరుకునే కాంబినేషన్ వల్లే టీ20 ఫార్మాట్‌లో అతడు స్థానం పొందలేకపోయాడని అన్నాడు. వన్డే, టెస్ట్ మ్యాచ్‌లలో అతడి సారథ్యంలో జట్టు బాగా ఆడుతుందని, అలాగే న్యూజిలాండ్‌తో సిరీస్‌ను కూడా టీమిండియా సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు.

టీ20 ప్రపంచ కప్ జట్టులో ఉన్న వాళ్లంతా మ్యాచ్ విన్నర్లేనని అన్నాడు. మనం వరుసగా ప్రపంచకప్‌లు గెలుస్తామనే నమ్మకం తనకు ఉందని, మనకు అలాంటి జట్టు ఉందని చెప్పాడు.

జట్టులో స్పిన్ బౌలర్ల కూర్పు కూడా చాలా బాగుందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తమ స్పిన్‌తో మ్యాచ్‌లను గెలిపించగలరని అన్నాడు. బ్యాటర్లు ఇప్పటికీ వరుణ్ చక్రవర్తి స్పిన్‌ను అర్థం చేసుకోలేకపోతున్నారని, కుల్‌దీప్ యాదవ్ బౌలింగులో వైవిధ్యం ఉంటుందని అన్నాడు. స్పిన్ కాంబినేషన్ చక్కగా ఉందని, వారు గాయాల పాలవకుండా చాలాకాలం పాటు టీమిండియాకు సేవలందించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.


More Telugu News