వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ సమస్య: జేసీ ప్రభాకర్ రెడ్డి

  • సుబ్బరాయసాగర్ ప్రాజెక్టుకు నీరు ఎప్పుడో రావాల్సిందన్న జేసీ
  • వైసీపీ పాలకులు గేట్లు కనీసం గ్రీజు కూడా పూయలేదని మండిపాటు
  • పెద్దారెడ్డి, ఆయన కొడుకులు ఎక్కడకు వెళ్లారని ప్రశ్న

అనంతపురం జిల్లాలో సుబ్బరాయసాగర్ ప్రాజెక్ట్‌కి నీటి విడుదలలో ఆలస్యం జరిగిందని, అది గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అనంతపురంలోని లక్ష్మీనగర్‌లో తన ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


"సుబ్బరాయసాగర్ ప్రాజెక్ట్‌కి ఎప్పుడో నీరు రావాల్సింది, కానీ వైసీపీ పాలకులు గేట్లకు కనీసం గ్రీజు పూసిన పాపాన పోలేదు. గేట్ల సమస్య వల్లే నీటి పంపిణీలో ఇంత ఆలస్యమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డ్యాం గేట్ల మరమ్మతులకు నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని డ్యాం గేట్ల మరమ్మతు బాధ్యతలను జలవనరుల నిపుణులు కన్నయ్యనాయుడు లాంటి వారికి అప్పగించాలి. టెండర్ల ద్వారా చేస్తే నిధులు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది" అని జేసీ చెప్పారు.

"ఎంపీఆర్ సౌత్ కెనాల్‌కు రూ.89 లక్షలు ఖర్చు చేసి మరమ్మతులు చేశాం. ఇప్పుడు ఎంపీఆర్ నుంచి సౌత్ కెనాల్‌కి సజావుగా నీరు వెళుతోంది. కాలువలో 280 క్యూసెక్కుల ప్రవాహం ఉంటేనే పుట్లూరు చెరువుకు నీరు చేరుతుంది. కానీ, ఎగువ ప్రాంత రైతులు అనవసరంగా గేట్లు ఎత్తి నీరు వాడుకుంటున్నారు. ఈ విషయంపై అధికారులతో మాట్లాడాం, మళ్లీ చర్చించి సమస్య పరిష్కరిస్తాం" అని తెలిపారు.


ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై కూడా జేసీ ఫైర్ అయ్యారు. హెచ్‌ఎల్‌సీ నీటిపై తుంపెర డీప్‌కట్ వద్ద జరిగిన ఘటన గురించి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని చెప్పారు. తుంపెర డీప్‌కట్ వద్ద కాలువకు అడ్డం వేసింది ధర్మవరం ప్రాంత రైతులేనని, కలెక్టర్‌ అడ్డు తీయించారని తెలిపారు. నీరంతా చిత్రావతి నదిలోకి వెళ్లిపోయిందని చెప్పారు.


నీ చిన్నాన్న, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కొడుకులు ఎక్కడికి వెళ్లారు? అని జేసీ ప్రశ్నించారు. "వచ్చి రాజకీయాలు చేయండి. మూడేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వస్తే చూస్తాం, చేస్తాం అని చెప్పడం కాదు. అధికారం ఉన్నా, లేకపోయినా ఒకేలా ఉండాలి. వైసీపీ అధికారంలో ఉన్నపుడు మేం రాజకీయం చేశాం. మీలా మూడేళ్ల తర్వాత చేస్తాం అనలేదు. పదేళ్లుగా గన్‌మెన్ లేకుండా తిరుగుతున్నాం. మీరు గన్‌లు పెట్టుకుని తిరుగుతున్నారు” అని విమర్శించారు.



More Telugu News