PVN Madhav: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: వైసీపీకి పీవీఎన్ మాధవ్ కౌంటర్

PVN Madhav Counters YCP Claims on Bhogapuram Airport Success
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత నూటికి నూరు శాతం కూటమిదేనన్న పీవీఎన్ మాధవ్
  • వైసీపీ హయాంలో రాష్ట్రంలో అరాచకం సృష్టించారని విమర్శ
  • కుప్పం వరకు హంద్రీనీవా నీళ్లు అందిస్తామని హామీ
  • ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు వేగవంతం చేస్తామని వెల్లడి
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఘనత తమదేనంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్రంగా ఖండించారు. ఆ ఎయిర్‌పోర్ట్ ఘనత నూటికి నూరు శాతం కూటమి ప్రభుత్వానిదేనని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన మంగళవారం విశాఖపట్నంలో స్పష్టం చేశారు.

గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించి, సంపదను నాశనం చేసిందని మాధవ్ ఆరోపించారు. ఇప్పుడు అన్నీ తామే చేశామని చెప్పుకోవడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని విమ‌ర్శించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు వల్ల ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుందని, ఈ విషయాన్ని వైసీపీ నేతలు కూడా స్వాగతించాలని ఆయన కోరారు.

ఇదే సందర్భంగా రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల గురించి కూడా మాధవ్ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారానికి ట్రైబ్యునల్స్ ఉన్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొన్ని కొత్త ప్రాజెక్టులను ప్రకటించిందని, పాత ప్రాజెక్టులను పూర్తిచేయడంపై దృష్టి పెట్టిందని తెలిపారు. 

హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసి కుప్పం వరకు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే పురుషోత్తపట్నం పనులు పూర్తిస్థాయిలో మొదలవుతాయని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఏపీ సమగ్రాభివృద్ధి శరవేగంగా జరుగుతుందని మాధవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
PVN Madhav
Bhogaipuram Airport
Andhra Pradesh
AP BJP
YS Jagan Mohan Reddy
Uttarandhra
Water Projects
Handri Niva Canal
Purushottapatnam Project
Telugu States Water Dispute

More Telugu News