Daggubati Purandeswari: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి ఈ స్టేషన్ లోనూ ఆగుతుంది!

Daggubati Purandeswari Inaugurates Janmabhoomi Express Stop at Anaparthi
  • అనపర్తి రైల్వే స్టేషన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్
  • జెండా ఊపి ప్రారంభించిన ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
  • ఎన్నికల హామీని ఏడాదిన్నరలోనే నెరవేర్చామని వెల్లడి
  • ప్రజల చిరకాల డిమాండ్ తీరడంతో స్థానికుల హర్షం
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి వాసుల కోరిక నెరవేరింది. విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12805/12806) ఇకపై అనపర్తి రైల్వే స్టేషన్‌లోనూ ఆగనుంది. ఈ రైలు హాల్టింగ్‌ను మంగళవారం రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు రైలుకు పచ్చ జెండా ఊపి సాగనంపారు. అంతకుముందు కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు భారీ ర్యాలీగా రైల్వే స్టేషన్‌కు చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. అనపర్తిలో పది రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చినంత ఆనందంగా ఉందని నేతలు వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ పురందేశ్వరి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమను అడిగిన మొదటి కోరిక జన్మభూమి హాల్టింగ్ అని, దానిని గెలిచిన ఏడాదిన్నరలోనే నెరవేర్చామని తెలిపారు. ఈ విజయం ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ల సహకారంతోనే సాధ్యమైందని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ఏళ్లనాటి డిమాండ్ నెరవేరడంపై ఈ ప్రాంత ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Daggubati Purandeswari
Janmabhoomi Express
Anaparthi
Rajahmundry MP
Nallamilli Ramakrishna Reddy
Visakhapatnam
Lingampalli
Railway Halting
East Godavari District

More Telugu News