Aman Rao: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ కుర్రాడి విధ్వంసం.. డబుల్ సెంచరీ బాదిన అమన్ రావ్

Aman Rao Smashes Double Century in Vijay Hazare Trophy
  • బెంగాల్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన 21 ఏళ్ల యువ కెరటం
  • ఆడుతున్నది మూడో లిస్ట్ ఏ మ్యాచ్‌లోనే ఈ అరుదైన ఫీట్ 
  • 150 నుంచి 200 పరుగులు కేవలం 20 బంతుల్లోనే పూర్తి
  • ఇటీవ‌ల‌ ఐపీఎల్ వేలంలో అమన్ రావ్‌ను కొన్న‌ రాజస్థాన్ రాయల్స్
విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ యువ బ్యాటర్ అమన్ రావ్ పేరాల సంచలనం సృష్టించాడు. బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తాను ఆడుతున్న మూడో లిస్ట్ ఏ మ్యాచ్‌లోనే ఈ అద్భుత ఘనతను సాధించడం విశేషం.

ఇన్నింగ్స్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన 21 ఏళ్ల అమన్, తొలి 10 బంతుల్లో 3 పరుగులే చేశాడు. ఓపెనర్ రాహుల్ సింగ్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత గేరు మార్చాడు. 65 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను, 107 బంతుల్లో తన తొలి లిస్ట్ ఏ శతకాన్ని అందుకున్నాడు. శతకం తర్వాత అసలు విధ్వంసం మొదలుపెట్టాడు. 150 పరుగుల మార్కును 134 బంతుల్లో దాటిన అమన్, ఆ తర్వాత మరో 20 బంతుల్లోనే 200 పరుగుల మైలురాయిని చేరుకోవడం అతని దూకుడుకు నిదర్శనం. చివరి ఓవర్‌లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 13 భారీ సిక్సర్లు ఉన్నాయి.

ఈ ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు 5 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇది కేవలం తొమ్మిదో డబుల్ సెంచరీ కాగా, లిస్ట్ ఏ ఫార్మాట్‌లో ద్విశతకం సాధించిన 15వ భారత బ్యాటర్‌గా అమన్ రికార్డు సృష్టించాడు. గత డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో అమన్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.30ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Aman Rao
Vijay Hazare Trophy
Hyderabad
Double Century
Bengal
List A
Rajasthan Royals
IPL 2026

More Telugu News